ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసేసరికే చాలాచోట్ల వైకాపా హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులోని స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు ఏకగీవ్రంగా గెలిచారు. పలువురు మంత్రుల నియోజకవర్గాల్లోనూ మెజార్టీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులే విజయం సాధించారు. నామినేషన్లు వేయకుండా తొలిరోజు నుంచే అడ్డగింతలు, దౌర్జన్యాలు.. నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేయడం, తీవ్రస్థాయి బెదిరింపులు, వేధింపులు.. తదితర ఉద్రిక్త పరిణామాల మధ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ శనివారం పూర్తయింది.
నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండగా.. పలు మండలాల్లో రాత్రి దాకా కొనసాగింది. దీనిపై గుంటూరు జిల్లా వినుకొండ, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలాల్లో తెదేపా నేతలు ఆందోళనలు చేశారు. తమను బలవంతంగా తీసుకొచ్చారని కొందరు.. అధికారులు, వైకాపా నేతలు కుమ్మక్కై తమ సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఆరోపించారు.
ముఖ్యమంత్రి ఇలాకాలో..
సీఎం సొంత జిల్లా కడపలో 50 జడ్పీటీసీ స్థానాలకుగాను 35 వైకాపాకే ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికకు ముందే ఇక్కడ జడ్పీ పీఠం వైకాపాకే దక్కడం ఖాయమైపోయింది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో మొత్తం ఏడు జడ్పీటీసీలు వైకాపాకే ఏకగ్రీవమయ్యాయి. ఏడు మండలాల్లోని 65 ఎంపీటీసీ స్థానాలూ వైకాపా వశమయ్యాయి. కమలాపురం నియోజకవర్గంలో 6, మైదుకూరు నియోజకవర్గంలో 5 జడ్పీటీసీ స్థానాలూ వైకాపాకే దక్కాయి. కమలాపురంలో 58 ఎంపీటీసీ స్థానాలకు 52, మైదుకూరులో 61 ఎంపీటీసీ స్థానాలకు 54చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే రాయచోటి నియోజకవర్గంలో ఆరు జడ్పీటీసీలూ వైకాపాకే దక్కాయి. 67 ఎంపీటీసీ స్థానాల్లో 65 వైకాపా ఖాతాలో పడ్డాయి. రాజంపేట నియోజకవర్గంలో 70 ఎంపీటీసీ స్థానాల్లో 60 చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. 3 చోట్ల తెదేపా అభ్యర్థులు ఎన్నికయ్యారు. మాచర్ల నియోజకవర్గంలో 5 జడ్పీటీసీలూ వైకాపా ఖాతాలో చేరాయి. 69 ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థ్ధులే ఏకగ్రీవమయ్యారు. గురజాల నియోజకవర్గంలో 57 ఎంపీటీసీ స్థానాలకు 47 వైకాపాకే దక్కాయి. గుంటూరు జిల్లా కొల్లిపరలో జడ్పీటీసీకి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రశాంతి ఉపసంహరించుకుని వైకాపాలో చేరారు. ఇక్కడనుంచి వైకాపా తరపున జడ్పీ అధ్యక్ష స్థానం ఆశిస్తున్న కత్తెర క్రిస్టినా పోటీ చేస్తున్నారు.