విశాఖ ఉక్కుపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదని, వచ్చాకే ముఖ్యమంత్రిని కలిసి నిర్ణయం తీసుకుంటామని ఎంపీ బాలశౌరి తెలిపారు. దిల్లీలో శుక్రవారం సహచర ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ రైల్వేజోన్‌పై ఎంపీ విజయసాయి రైల్వే మంత్రిని కలిశారని, చిన్నచిన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని బాలశౌరి వివరించారు. శాసనసభలో తాము ప్రవేశపెట్టిన రైతు బిల్లులనే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఎన్నికల యాప్ విషయంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. గతంలో ఓ లేఖ తెదేపా కార్యాలయంలో తయారైనట్లే, యాప్ కూడా అక్కడే తయారైందని విమర్శించారు. తన సొంత జిల్లా గుంటూరు, తనకు ఉద్యోగమిచ్చిన గురువు జిల్లా చిత్తూరులో ఆయన ఏకగ్రీవాలకు ఒప్పుకోనంటున్నారని.. గ్రామాలు ప్రశాంతంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు, ఇతర కేసులపై విచారించాలని ప్రధానిని కోరతామన్నారు. ప్రత్యేక హోదా అంశానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోందని.. యుద్ధాలు, విపత్తుల విషయంలో ప్రభుత్వాలు దృఢ నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ప్రగతి విషయంలో కాదని ఆయన అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం నిర్ణయాలు మార్చుకోవడమే ప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు.