రేషన్ బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు.
ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు నగదు చెల్లిస్తుంది. ఆ విధంగా చెల్లించాల్సిన మొత్తంలో ఇంకా 1,728 కోట్ల రూపాయల మేర బకాయి మిగిలి ఉందని.. ఈ మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేయాలన్నారు. 2020-21 ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. సాధ్యమైనంత త్వరగా బియ్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.