ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ తరహా కేసు తొలిసారి చూస్తున్నాం.. ఎంపీకి ఈసీ వెల్లడి - ఈసీతో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసీ అధికారులతో సమావేశమయ్యారు. పార్టీపై బహిరంగ ఆరోపణలు చేశారన్న అంశంపై తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్​ నోటీసుపై ఆయన అధికారులతో గంటన్నర పాటు చర్చించారు.

ఎన్నికల అధికారులతో రఘురామకృష్ణరాజు భేటీ
ఎన్నికల అధికారులతో రఘురామకృష్ణరాజు భేటీ

By

Published : Jun 26, 2020, 3:58 PM IST

Updated : Jun 26, 2020, 11:43 PM IST

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్​ నోటీసు చెల్లుబాటు అంశంపై ఆయన చర్చించారు. అసలు పార్టీ పేరు, షోకాజ్​ నోటీసుపై పేర్కొన్న పార్టీ మధ్య వ్యత్యాసంపై ఆరా తీశారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది.

సభ్యులెవరో చెప్పండి..!

వైకాపా క్రమశిక్షణ కమిటీ, దాని సభ్యులు ఎవరో చెప్పాలని.. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని.. ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కోరారు. పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా.. అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా.. అని ఎంపీ వారిని అడిగారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. ఈ తరహా కేసును తొలిసారి చూస్తున్నట్లు ఎంపీతో చెప్పారు. ఈ సమాచారం మంగళవారంలోగా ఇస్తామని తెలిపారు. అయితే సంబంధిత అధికారి లేకపోవడం వల్ల ఎంపీ రఘురామకృష్ణరాజు.. మరోసారి ఈసీ అధికారులను కలవనున్నారు.

లోక్ సభ స్పీకర్​తో భేటీ...

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఎంపీ రఘురామకృష్ణ రాజు కలిశారు. సుమారు 50 నిమిషాల పాటు భేటీ అయిన ఎంపీ.. తనకు రక్షణ కల్పించే విషయంపై స్పీకర్‌తో మాట్లాడినట్లు సమాచారం. కమిటీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల నిర్వహణపైనా ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..!

ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజుకు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. అయితే తనకు షోకాజ్​ నోటీసు ఇచ్చే అధికారం విజయసాయిరెడ్డికి అసలు ఉందా? లేదా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తనకు వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీ అనే లెటర్​ హెడ్​పై లేఖ పంపారని.. మనది రాష్ట్ర పార్టీ అయితే విజయసాయి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఈసీ గుర్తింపు పొందిన క్రమశిక్షణ కమిటీ మన పార్టీకి ఉందా అని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

ఇదీ చూడండి..

అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులకు నారా లోకేశ్ పరామర్శ

Last Updated : Jun 26, 2020, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details