వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తితిదే ఆస్తుల వ్యవహారంతో పాటు అక్రమంగా ఇసుక తరలింపు, ప్రభుత్వ భూముల వేలం వంటి అంశాల్లో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపానని చెప్పారు. తన వ్యాఖ్యలతో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు బాధపడినట్లు తెలిసిందన్నారు.
'వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన సిద్ధాంతం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తే... అధికార పార్టీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వారితో తిట్టిస్తారు. నాపై కూడా ప్రసాద్రాజుతో విమర్శలు చేయించారు. నేను ముఖ్యమంత్రిని సమయం అడగలేదని చెబుతున్నారు. నిజానికి నేను వైకాపాలోకి వస్తాననుకోలేదు. సీటు కోసం ఎవర్నీ బతిమిలాడలేదు. నిజం చెప్పాలంటే... వారు బతిమాలిడితేనే వైకాపాలో చేరాను తప్ప నాకు నేనుగా చేరలేదు'-రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
తాను నరసాపురం నుంచి పోటీ చేశాను కాబట్టే వైకాపా ఎంపీ స్థానం గెలుచుకుందని రఘురామకృష్ణరాజు అన్నారు. తాను పోటీలో ఉన్నాను కాబట్టే చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతను ఉద్దేశిస్తూ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు.