చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభిపై దాడి జరిగిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పర్యటించిన మోపిదేవి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో ప్రభుత్వ స్థలాల్లో ప్రజా ఉపయోగకరమైన కాంప్లెక్స్‌లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన మంత్రులపై కూడా పూర్తి అధికారం ఉందంటూ ఎస్ఈసీ దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. శాసనసభ రూల్స్‌కు వ్యతిరేకంగా మంత్రులకు నోటీసులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. చట్టాలకు లోబడి ఎన్నికల కమిషన్ అయినా, ఎవరైనా శాసన సభా హక్కులపై జోక్యం చేసుకోవాలి అన్నారు. సభా సాంప్రదాయ హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మోపిదేవి ఆరోపించారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాపాడేందుకు కొన్ని నిబంధనలు, చట్టాలు ఉన్నాయన్నారు. సభా హక్కులను కాపాడేందుకు ఎస్ఈసీని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.