స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అధికార నేతలు యథేచ్చగా దొంగఓట్లు వేశారన్న చంద్రబాబు ఆరోపణలను వైకాపా ఖండించింది(ycp mp mithun reddy slams tdp news). ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పలానా వ్యక్తి దొంగ ఓట్లు వేశారని, దొంగ ఒట్లు పోలయ్యాయని ఎవరూ ఫిర్యాదు చేయకపోవడమే దీనికి నిదర్శనమన్నారు.
ఫొటోలతో కూడిన ఓటరు జాబితాతో ఏజెంట్లు పోల్చుకునే ఓటింగ్ కు అనుమంతించారని, వెబ్ కాస్టింగ్, సీసీ టీవీల పర్యవేక్షణలో పోలింగ్ జరిగిందన్నారు. ఏ బూతులో అక్రమాలు జరిగాయో చెబితే ఆ బూతులో ఏం జరిగిందో ఆధారాలతో సహా వివరిస్తామన్నారు. దొంగ ఓట్లు వేశారనేది కేవలం కట్టుకథలే అని వ్యాఖ్యానించారు. కుప్పానికి వచ్చిన వారంతా ఇతర మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు తెప్పించిన వారేనని ఆరోపించారు. తెదేపా చేసిన పనులను కూడా వైకాపాపై మోపడం సరైనది కాదన్నారు. ప్రజలంతా సీఎం జగన్ పాలనను ఆదరిస్తున్నారని చెప్పారు. కుప్పంలో తప్పకుండా వైకాపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో కౌంటింగ్ ను వీడియో తీయాలన్న హైకోర్టు ఆదేశాలను తాము ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.