2019 సాధారణ ఎన్నికలకంటే స్థానిక సంస్థల పోరు నాటికి ముఖ్యమంత్రి జగన్ ప్రజాబలం పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపాకు స్థానిక సంస్థల్లో ఎప్పుడూ ప్రజామోదం లభించలేదు. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా చంద్రబాబు ఆపేశారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణకు పూనుకుంటే అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారు. 12కి 12 కార్పొరేషన్లనూ, 75మున్సిపాలిటీల్లో 74వైకాపా కైవసం చేసుకుంది. అమరావతిలోనూ పంచాయతీలు, స్థానిక సంస్థల్లో ఓడిపోయారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో కూడా ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి గెలిచారు’ అని పేర్కొన్నారు.
జగన్ కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా?: మంత్రి అనిల్
‘తెదేపా బి ఫారాలు ఇచ్చి, డబ్బులు పంచి, ప్రచారమూ చేసి, తర్వాత ఓటమి తప్పదని అర్థమై పోటీ చేయడం లేదంటూ పారిపోయి, ఇప్పుడు మేం పోటీ చేయలేదు కాబట్టే వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తున్నాయంటూ మాట్లాడేందుకు తెదేపా నేతలకు సిగ్గుందా’ అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. ఆదివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘తెదేపా నేతలు మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగమంటున్నారు..మీరంటున్నట్లుగా నిజంగా ఫ్యాక్షన్ రాజకీయమే మేం చేస్తే, జగన్ కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా? తిరగ్గలరా? అయ్యన్ననో, ఇంకొకరో ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడగలిగేవారా? గొయ్యిలో పాతేసి ఉండేవాళ్లం. కానీ, అవన్నీ మా జగన్ విధానం కాదు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఆయన, మేమూ సంయమనంతో పనిచేస్తున్నాం. జగన్‌కు ప్రజల్లో విశ్వాసం తగ్గిందని దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే మీ పార్టీలో మిగిలిన 19మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. మళ్లీ పోటీ చేసి గెలిచి అప్పుడు మాట్లాడండి’ అని మండిపడ్డారు.
ప్రజలు వైకాపా వైపే: మంత్రి ముత్తంశెట్టి
ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు పన్నినా.. రాష్ట్ర ప్రజలు వైకాపా వైపే ఉన్నారనేదానికి స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఊ.. అంటే చంద్రబాబు, లోకేశ్ తప్పా తెదేపాలో మిగిలిన వారంతా వైకాపాలోకి వచ్చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు: మంత్రి సురేష్