ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఐదేళ్లలో మీరేం చేశారు... అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేదు'

చంద్రబాబు అమరావతి పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల తెదేపా పాలనలో అభివృద్ధిని గాలికొదిలేసిన చంద్రబాబు... ఇప్పుడు పర్యటనలతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రాజధానిలో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని మంత్రులు పేర్కొన్నారు.

ministers
ministers

By

Published : Nov 28, 2019, 9:08 PM IST

చంద్రబాబు పర్యటనపై మంత్రుల స్పందన

ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేయకుండా... ఇప్పుడు పర్యటనల పేరుతో హడావుడి చేస్తున్నారని... జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ధ్వజమెత్తారు. కర్నూల్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపాను ప్రజలు 23 సీట్లకే పరిమితం చేసినా... చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. అమరావతి పేరుతో వేల కోట్లు దోపిడి చేశారని ఆరోపించారు. అమరావతిలో బాబుకు నల్ల జెండాలు, చెప్పులతో స్వాగతం పలికారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైన మారకుంటే అమరావతిలో జరిగినట్లే అన్ని జిల్లాల్లో జరుగుతుందని దుయ్యబట్టారు.

పెయిడ్​ ఆర్టిస్ట్​లతో దాడులు...
అమరావతిలో తాత్కాలిక భవనాలు తప్ప చంద్రబాబు ఏ కట్టడాలు నిర్మించారో... చూపించాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డిమాండ్ చేశారు. రాజధానిలో పర్యటించే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలే పెయిడ్ ఆర్టిస్టులతో రైతులపై దాడి చేయించారని ఆరోపించారు. ప్యాకేజీల పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. అంబేడ్కర్ స్మృతివనం దగ్గరికి చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇన్​సైడ్ ట్రేడింగ్ పేరుతో రాజధాని వాసులను మోసం చేశారని ఆరోపించారు.

చంద్రబాబు పర్యటనపై వైకాపా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు

'సింగపూర్' వెళ్లిపోవడానికి బాబే కారణం...
ప్రజలను తప్పుదోవ పట్టించటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీముఖ్యమంత్రి చంద్రబాబు, తన అవినీతి వెలుగులోకి వస్తుందనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు నుంచి సింగపూర్​ కన్సార్షియం వెళ్లిపోవడానికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు. అమరావతిలో నిజంగా అభివృద్ధి జరిగితే... లోకేశ్ ఎందుకు ఓడిపోయారని అనంత ప్రశ్నించారు.

వికేంద్రీకరణతోనే అభివృద్ధి...
ఎప్పుడో రాచరికం ఉన్నప్పుడు రాజధాని కేంద్రీకరణ జరిగిందని... ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వికేంద్రీకరణ జరుగుతోందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కేవలం అమరావతినే అభివృద్ధి చేయాలని చంద్రబాబు అనడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లపాటు అమరావతిని ఎందుకు నోటిఫై చేయలేదని ప్రశ్నించారు. రాజధానిలో జరిగిన అన్ని అవినీతి పనులను బయటపెడతామని స్పష్టం చేశారు.

అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు..
చంద్రబాబు రాజధాని పర్యటన వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటో పరిశీలిస్తామని... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లక్ష కోట్ల పైన అభివృద్ధి అంటూ అంచనాలు వేసి... కేవలం నాలుగు వేల కోట్ల పనులు మాత్రమే చేశారన్నారు. ఈ ప్రాంతంపై చంద్రబాబుకు మమకారం ఉంటే హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకొని... ఎందుకు అమరావతిలో కట్టుకోలేదని ప్రశ్నించారు. లోకేశ్ తోడల్లుడికి 500 ఎకరాలు భూమిని చంద్రబాబు ఇచ్చారని ఆరోపించారు. అసైన్డ్ భూముల విషయంలో అన్యాయం జరిగింది కాబట్టే దళితులు, అన్యాయానికి గురైన వారు చంద్రబాబుపై తిరగబడుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

''అమరావతిపై ఎందుకింత కుట్ర.. మనకు రాజధాని వద్దా?''

నవ్యాంధ్ర రాజధానికి ప్రణమిల్లిన చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details