‘ఈ ఫలితాలు చూసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీచేస్తారని అనుకోవడం లేదు. ఒకవేళ పోటీచేస్తే మేం ఎవరిని నిలపాలనే దానిపై మంచి నిర్ణయం తీసుకుంటాం. పుంగనూరు వచ్చి నాపై పోటీచేయాలని చంద్రబాబును ఆహ్వానిస్తున్నా. మీపై గెలిచినా, ఓడినా మాకు బాగుంటుంది’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(minister peddireddy) పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘పార్టీని శూన్యం చేసిన చంద్రబాబు(Chandrababu) తన నియోజకవర్గంలోనూ మూలాలు లేకుండా చేసుకున్నారు. ఇంకా ఆయన పార్టీ అధినేతగా ఉండటం అసందర్భం. ఎన్టీఆర్ కుటుంబీకుల్లో ఎవరికైనా బాధ్యతలిచ్చి, ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలి. ప్రచారంలో మా గురించి దుర్మార్గంగా మాట్లాడారు. ఇకపై అనరాని మాటలంటే ఎలా స్పందిస్తానో చూపిస్తా’ అని హెచ్చరించారు. ‘దొంగ ఓట్లపై ఒక్క తెదేపా ఏజెంట్ కూడా ఫిర్యాదు చేయలేదు. సీఎం ఇన్ని కార్యక్రమాలు చేపట్టాక కుప్పంలో డబ్బులు పంచాల్సిన కర్మ మాకెందుకు?’ అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
కొండపల్లి మాకే వచ్చే అవకాశం: సజ్జల
‘చంద్రబాబు విషయంలో కుప్పం ప్రజలూ విసిగిపోయారు కాబట్టే ఇప్పుడు ఎన్నికల్లో నీకో దండం అన్నారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrisna Reddy) అన్నారు. ‘స్థానిక సంస్థల్లో 97% వరకు కైవసం చేసుకోవడం ద్వారా 2019లో 50% ఓట్లతో ప్రారంమైన వైకాపా జైత్రయాత్ర ఇప్పుడు 60-65శాతానికి చేరింది. కొండపల్లి కూడా మా ఖాతాలోకే వచ్చే అవకాశం ఉంది’ అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని జాతీయస్థాయిలో తెదేపా పండగ చేయాలనుకుంటే వారికి దండం పెట్టడం తప్ప ఏమనగలం? వైకాపా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలంటూ అచ్చెన్నాయుడు తలకాయ లేని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకున్న పదిమందో 20 మందో ముందు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి రెఫరెండం అని సవాల్ చేయమనండి’ అన్నారు.
బాబు, లోకేశ్‌కు నియోజకవర్గాల్లేవు: విజయసాయిరెడ్డి
‘మంగళగిరిలో లోకేశ్‌కు, కుప్పంలో చంద్రబాబుకు ఇక నియోజకవర్గాల్లేవు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ వేరే నియోజకవర్గాలు చూసుకోవాల్సిందే’ అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. ‘స్థానిక సంస్థల ఫలితాలతో తెదేపా పని పూర్తయిందని, 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ అంతర్ధానమవుతుందని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది. ఇక హైదరాబాద్ ప్రవాసాంధ్రుడిగా చంద్రబాబు విశ్రాంతి తీసుకోవచ్చు. కేసు పెడితే 48గంటల్లో స్టే తెస్తానని లోకేశ్ మాట్లాడడం న్యాయవ్యవస్థను కించపరచడమే. ప్రజల మనసు గెలుచుకోలేని చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెడితే గెలుస్తారా?’ అని ప్రశ్నించారు.
కుప్పం ప్రజలకు స్వాతంత్య్రం: నారాయణస్వామి
‘కుప్పం ప్రజలకు ఇపుడు అసలైన స్వాతంత్య్రం వచ్చింది. సీఎం జగన్‌ను బాధించేలా చంద్రబాబు విమర్శలు చేయడంతో.. ప్రజలంతా జగన్‌కు చేరువయ్యారు. ప్రతిసారీ 40వేల దొంగ ఓట్లు వేసుకొని బాబు గెలిచేవారు’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు.