అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు ఏర్పాటు చేయొచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడాన్ని... అధికార పార్టీ నేతలు స్వాగతించారు. ఇదో చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. గత ప్రభుత్వం కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. రాజధాని తమ ప్రాధాన్యత కానేకాదని స్పష్టం చేశారు.
విభజన తర్వాత తీవ్రమైన అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి లక్ష కోట్ల రాజధాని అవసరం లేదని మంత్రులు పేర్కొన్నారు. ప్రజల కనీస సౌకర్యాలు తీర్చడమే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు... వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని ఆ ప్రాంత వైకాపా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.