ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జిల్లాల ఏర్పాటుపై కొనసాగుతున్న అధికార విపక్షాల అభ్యర్దనలు,ఆందోళనలు - ap new districts

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను స్వాగతిస్తూనే.. కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు వైకాపా ప్రజాప్రతినిధులు. నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండుతో వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ నేతృత్వంలో శుక్రవారం చర్చావేదిక ఏర్పాటైంది. శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్‌గా చేసి.. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురం, వరదయ్యపాళెం, బీఎన్‌ కండ్రిగ, సత్యవేడు మండలాలను అందులో కలపాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కలెక్టర్‌ హరినారాయణన్‌ను కోరారు.

ycp leaders on new districts
ycp leaders on new districts

By

Published : Jan 29, 2022, 9:19 AM IST

నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండుతో వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ నేతృత్వంలో శుక్రవారం చర్చావేదిక ఏర్పాటైంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్‌ మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి నెలాఖరులోగా సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డిని మరోసారి కలుస్తాం. ప్రజల అభీష్టాన్ని వారి దృష్టికి తీసుకువెళతాం. జిల్లా కేంద్రంగా నర్సీపట్నాన్నే ప్రకటించాలని కోరతాం’ అన్నారు. ‘అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోనే ఉన్నందున దాంతోపాటే అభివృద్ధి చెందుతుంది. వెనుకబడిన నర్సీపట్నానికి ప్రాధాన్యం ఇవ్వడమే సముచితం’ అని పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా పేరును ఖరారు చేయాలి

ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకొని అదే పేరును జిల్లాకు ఖరారు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ డిమాండు చేశారు. శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.

శ్రీకాళహస్తిని డివిజన్‌గా చేయాలి

శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్‌గా చేసి.. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురం, వరదయ్యపాళెం, బీఎన్‌ కండ్రిగ, సత్యవేడు మండలాలను అందులో కలపాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కలెక్టర్‌ హరినారాయణన్‌ను కోరారు. ఏర్పేడు మండలాన్ని.. ప్రస్తుతమున్న తిరుపతి డివిజన్‌లోనే ఉంచాలని వైకాపా ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఏర్పేడు మండలాన్ని తిరుపతి డివిజన్‌లోనే కొనసాగించాలని తెదేపా మండల అధ్యక్షుడు పొన్నారావు డిమాండ్‌ చేశారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలంటూ ములకలచెరువు జాతీయ రహదారిపై అఖిలపక్షంగా ఏర్పడిన తెదేపా, జనసేన, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌ నాయకులు నిరసన తెలిపారు. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలంటూ తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.

పెదకూరపాడును గురజాలలో కలపడం ఇబ్బందే

గుంటూరు జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే ప్రతిపాదిత రెవెన్యూ డివిజన్‌, జిల్లా కేంద్రాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. గుంటూరులో శుక్రవారం నిర్వహించిన జడ్పీ సమావేశంలో ఆ పార్టీకి చెందిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు, సీఎంవో అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కేంద్రంగా పిడుగురాళ్లను ప్రకటించాలన్నారు. ఇప్పటికే సీఎంకు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:New Districts in AP : నూతన జిల్లాల ఏర్పాటుపై .. ఆరని నిరసన జ్వాలలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details