బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి...జగన్ కేబినెట్లో ఆర్థికమంత్రి. శాసనసభ చర్చల్లో లెక్కలు చెబుతూ.. ఛలోక్తులు విసురుతూ... విషయ పరిజ్ఞానంతో తన మార్క్‌ను చూపుతారు. అధికార పార్టీలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన రాజకీయ ప్రస్థానం సర్పంచి పదవి నుంచే మొదలైంది.
తెదేపా..కాంగ్రెస్...వైకాపా...!
బేతంచెర్ల పట్టణానికి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సర్పంచి నుంచి ఆర్థికశాఖ మంత్రి వరకు ఎదిగారు. 1995లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001లో జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి గెలిచారు. పదేళ్లుగా సర్పంచిగా ప్రజలకు సేవలు అందించారు. 2008లో తెదేపా నుంచి... అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మకు మద్దతుగా నిలిచారు. వైఎస్ మరణానంతరం వైకాపాలో చేరారు. 2014లో డోన్ శాసనసభ నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి 11,152 ఓట్ల తేడాతో గెలుపొందారు. పీఏసీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు.