ycp-govt-six-months-rule-progress-report ఆరు నెలల పాలనపై వైకాపా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నవరత్నాలు సహా 35 అంశాలపై 29 హామీలు సంక్షేమ పథకాలుగా అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ప్రత్యేకంగా ఐఐఎం అహ్మదాబాద్ లాంటి ప్రఖ్యాత సంస్థలతో అవినీతిపై అధ్యయనం చేయిస్తున్నట్టు స్పష్టం చేసింది. హామీలను వేగవంతంగా అమలు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని పేర్కొంది. నవరత్నాలు సహా మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాలపై ఉత్తర్వులు జారీ చేయటం వలన పాటు వాటి అమలు కార్యాచరణపైనా పర్యవేక్షణ చేస్తున్నట్టు వెల్లడించింది.
ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు
గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో పాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. పౌరసేవలను ఇంటిముంగిటకే తీసుకెళ్లామని తెలిపింది. లక్షల సంఖ్యలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటంతో పాటు వాలంటీర్లను నియమించినట్లు వెల్లడించింది.
వినూత్న విధానాలు
రివర్స్‌టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ లాంటి వినూత్న ప్రక్రియల ద్వారా పారదర్శకంగా పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేస్తున్నామని తెలిపింది. పోలవరం సహా వేర్వేరు అంశాల్లో వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యిందని స్పష్టం చేసింది. ఇక వంద కోట్ల రూపాయలు దాటిన ప్రతీ టెండరునూ జ్యూడీషియల్ కమిషన్ సమీక్ష తర్వాతే జారీచేయాలని నిర్ణయించినట్టు తెలియచేసింది. ఇసుక అక్రమాలపై 14500 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పారదర్శకత విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
సమస్యలపై స్పందన
పౌర సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే దిశగా స్పందన వేదికను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరు నెలల్లో 8 లక్షల 15 వేల 461 వినతుల్లో 78 శాతం మేర పరిష్కారమయ్యాయని ప్రభుత్వం తెలిపింది. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 1303 ఎఫ్‌ఐఆర్‌లు రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలిపింది. ఇలా మొత్తంగా అన్ని అంశాల్లోనూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :
'ఆరునెలల అద్భుత పాలనపై... కొందరికి కడుపుమంట'