‘మూడేళ్లలో రూ. 1.40 లక్షల కోట్లు పేదల సంక్షేమానికి ఖర్చు చేశాం..’ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, సలహాదారుల వరకు పదేపదే చెబుతున్న మాట ఇది. మరి ఇంత పెద్ద మొత్తం పేదల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వానికి టిడ్కో గృహాలు కనిపించలేదా? వాటి కోసం కనీసం రూ. 1500 కోట్లు ఖర్చు చేయలేదా? ఆ మాత్రం వెచ్చిస్తే ఇప్పటికే పూర్తయిన 1.50 లక్షల ఇళ్లను మూడు నెలల్లోనే పేదలకు ఇచ్చేయొచ్చు.
అలాంటిది మూడేళ్లుగా ఎడతెగని జాప్యం ఎందుకు? పేదలకు గూడు కల్పన సంక్షేమం కోవలోకి రాదా? వేల కోట్లు ఖర్చు చేసి గత ప్రభుత్వ హయాంలోనే 90 శాతానికి పైగా పూర్తయిన వేల గృహాలను పాడుబెట్టడం ఎందుకు? వాటిని పేదలకు అప్పగిస్తే.. ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ ఏడాదికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు చెల్లించలేక అవస్థలు పడుతున్నవారికి ఆ మొత్తం మిగులుతుంది కదా? ఇరుకు గదుల్లో మగ్గుతున్న పేదలకు రూ. 6 నుంచి రూ. 8 లక్షలు వెచ్చించి కట్టిన ఇళ్లను ఇస్తే.. స్థలం విలువతో కలిపి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆస్తిని అందించినట్లు కాదా? సకల సౌకర్యాలతో కూడిన టిడ్కో లోగిళ్లను అందించడంలో పిల్లిమొగ్గలు ఎందుకు? అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా అదిగో.. ఇదిగో అంటూ కప్పదాట్లు వేయడం తప్ప ఇళ్లను మాత్రం అందజేయడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
నాలుగు వాయిదాల్లోనే ఎలా కడతారు? :మొత్తం 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు రూ. 10,000 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులోలబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలుగా రూ. 4,000 కోట్లు టిడ్కోకు అందాలి. మిగతా రూ. 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాలని టిడ్కోకు స్పష్టం చేసింది. అంటే రుణంతోనే టిడ్కో గృహాల్ని పూర్తి చేయాలనేది ప్రభుత్వ యోచన అని తెలుస్తోంది. కానీ ఏడాదిగా అధికారులు ప్రయత్నిస్తున్నా ఒక్క ఆర్థిక సంస్థ కూడా రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. లబ్ధిదారుల పేరు మీద రుణం ఇచ్చేందుకూ చాలా బ్యాంకులు కొర్రీలు వేస్తున్నాయి. ఏడాదిగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు రూ.800 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి. బ్యాంకులు మొరాయిస్తుండటంతో ‘స్వచ్ఛందం’ పేరుతో రుణమొత్తాన్ని నాలుగు విడతల్లో లబ్ధిదారులు చెల్లించేలా అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.