2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించి అధికారం చేపట్టింది. వైకాపా అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తైంది. తొలిసారి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎం మేధోమథన సదస్సు నిర్వహిస్తున్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించేలా
ఏడాది పాలన పూర్తైన సందర్భంగా రైతన్నలకు మేలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతు సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్రం వ్యాప్తంగా గ్రామానికి ఒకటి చొప్పున రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,641 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. ఇక్కడ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ప్రభుత్వమే విక్రయించనుంది. భూసార పరీక్షలు జరిపి రైతులు ఏ పంట వేస్తే ప్రయోజనమో సలహాలు ఇస్తారు.