రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతనలేదని భాజపా నేతలు విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై దిల్లీలో సమావేశమైన భాజపా నేతలు... వైకాపా సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిపై స్పష్టత ఇవ్వకుండా... ఆ ప్రాంత రైతులను ఏపీ ప్రభుత్వం ఆందోళనకు గురి చేస్తోందని ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.
వైకాపా ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడి దారులు భయపడి పారిపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని సూచిస్తే వైకాపా నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.30 వేల కోట్లు అప్పు చేసిందని వెల్లడించారు. ఇలానే వ్యవహరిస్తే ఏపీ ఆర్థికవ్యవస్థ ఏమవుతుందని ప్రశ్నించారు.