ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపోరులో వైకాపా జోరు.. 11 కార్పొరేషన్లు కైవసం - ap municipal corporation election results news

నగరపాలికల్లో ఫ్యాన్‌ గాలి బలంగా వీచింది. 13 జిల్లాల్లోని 11 కార్పొరేషన్లనూ వైకాపా వశం చేసుకుంది. పుర ప్రజలు వైకాపా విజయంపై విస్పష్ట తీర్పునివ్వగా.. మేయర్ల ఎంపికకు కసరత్తులు మొదలయ్యాయి. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రభావం తక్కువగా కనిపించింది. కొన్నిచోట్ల జనసేన, వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు మెరిశారు.

ycp

By

Published : Mar 14, 2021, 10:18 PM IST

Updated : Mar 15, 2021, 6:20 AM IST

కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైకాపా విస్పష్ట ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని మొత్తం 11 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే పెద్దదైన విశాఖ కార్పొరేషన్‌లో అధికార వైకాపా పాగా వేసింది. మొత్తం 98 డివిజన్లకు గాను.. 97 స్థానాల ఫలితాలు వచ్చాయి. వైకాపా 58 స్థానాలు గెలుచుకోగా.. తెలుగుదేశం 29 చోట్ల విజయం సాధించింది. జనసేన-భాజపా కూటమి 4 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఎం, సీపీఐ చెరో స్థానం గెలిచారు. 78వ డివిజన్‌లో సీపీయం అభ్యర్థి గంగారావు విజయం సాధించారు. స్టీల్‌ ప్లాంట్‌ సంరక్షణ ఉద్యమానికి తన విజయాన్ని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.

విజయవాడ మేయర్ పీఠాన్ని వైకాపా కైవసం చేసుకుంది. కార్పొరేషన్‌లోని మొత్తం 64 డివిజన్లలో వైకాపా 49 వార్డుల్లో విజయఢంకా మోగించింది. ప్రధాన ప్రతిపక్షం కేవలం 14 స్థానాలకు పరిమితం కాగా.. ఒక చోట సీపీయం గెలుపొందింది. తెదేపా మేయర్‌ అభ్యర్థి కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి విజయం సాధించారు. 9వ డివిజన్‌లో చెన్నుపాటి క్రాంతిశ్రీ.. 45వ డివిజన్​లో మైలవరపు లావణ్య విజయం తెలుగుదేశం తరఫున గెలుపొందారు. మచిలీపట్నం కార్పొరేషన్‌లో ఇప్పటివరకు 27 స్థానాల్లో వైకాపా గెలుపొందింది. తెలుగుదేశం 4 చోట్ల.. జనసేన ఒకచోట విజయం సాధించింది.

వైకాపా హస్తగతం..

గుంటూరు కార్పొరేషన్‌ అధికార వైకాపా పరమైంది. ఇక్కడ మొత్తం 57 డివిజన్లు ఉండగా.. 44 స్థానాల్లో వైకాపా జయకేతనం ఎగరేసింది. తెదేపా 9 స్థానాల్లో గెలుపొందగా.. జనసేన, స్వతంత్రులు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఒంగోలు కార్పొరేషన్‌ వైకాపా వశమైంది. మొత్తం 50 డివిజన్లకు గాను.. ఒక స్థానం వైకాపాకు ఏకగ్రీవం కాగా.. 49 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో వైకాపా 40 స్థానాలు కైవసం చేసుకుని కార్పొరేషన్‌పై జెండా ఎగరవేసింది. తెలుగుదేశం 6, జనసేన ఒక స్థానంలో గెలిచాయి. ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా కడపలో వైకాపా జెండా ఎగిరింది. కడప కార్పొరేషన్‌లోని మొత్తం 50 డివిజన్లలో 48 స్థానాల్లో వైకాపా గెలుపొందింది. తెలుగుదేశం, ఇతరులు చెరో స్థానంలో గెలిచారు. ఇక్కడ గతంలో 24 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి.

చిత్తూరు కార్పొరేషన్‌ వైకాపా ఖాతాలో చేరింది. మొత్తం 50 డివిజన్లలో వైకాపా 46 స్థానాల్లో గెలుపొంది. కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. తెలుగుదేశం 3 స్థానాలకు పరిమితం కాగా.. స్వతంత్రులు ఒకచోట గెలిచారు. తిరుపతి నగరపాలక సంస్థనూ వైకాపా హస్తగతం చేసుకుంది. మొత్తం 49 డివిజన్లలో 48 స్థానాల్లో జయభేరి మోగించింది. మిగిలిన ఒక స్థానంలో తెలుగుదేశం గెలుపొందింది. ఇక్కడ గతంలోనే 22 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి.

కర్నూలు కార్పొరేషన్‌ వైకాపా ఖాతాలోకి చేరింది. మొత్తం 52 డివిజన్లకు గానూ.. 41 స్థానాల్లో వైకాపా జెండా ఎగిరింది. తెలుగుదేశం 8, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషనూ అధికార పక్షం పంచనే చేరింది. 50 డివిజన్లు ఉన్న అనంతపురం కార్పొరేషన్‌లో 48 స్థానాలకు వైకాపా కైవసం చేసుకోగా.. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు. విజయనగరం కార్పొరేషన్​పై వైకాపా జెండా ఎగిరింది. మొత్తం 50 డివిజన్లకుగానూ వైకాపా 42 స్థానాల్లో గెలుపొందింది. తెలుగుదేశం ఒక స్థానంలో విజయం సాధించింది. స్వతంత్రులు ఒక స్థానంలో గెలుపొందారు.

ఇదీ చదవండి

ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్​లో ఫ్యాన్ గాలి

Last Updated : Mar 15, 2021, 6:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details