ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్​

CM KCR: తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు.

KCR on Paddy Procurement
KCR on Paddy Procurement

By

Published : Apr 12, 2022, 7:26 PM IST

యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్​

KCR on Paddy Procurement: తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం కొంటామని తెలిపారు. క్వింటాల్‌కు రూ.1960 చొప్పున ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుంచే యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

దేశంలో పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశ రాజధానిలో 13 నెలల పాటు రైతులు ఉద్యమించారని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టాలని ప్రధాని మోదీ చూశారని ఆరోపించారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పి 3 సాగు చట్టాలను రద్దు చేశారని అన్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెంచి సాగు వ్యయం పెంచారని మండిపడ్డారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ మరో ఒత్తిడి చేశారని కేసీఆర్​ అన్నారు. విద్యుత్‌ సంస్కరణలు పేరిట రైతుల నుంచి ఛార్జీలు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ధాన్యం కొనాలని కోరితే కేంద్రమంత్రులు అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నూకలు తినే అలవాటు చేసుకోవాలని పీయూష్‌ గోయల్‌ అన్నారని... ఇంత చక్కని పంటలు పండిస్తూ ప్రజలు నూకలు తినాలా? అని ప్రశ్నించారు.

'కేంద్రానికి ధాన్యం కొనటం చేతకాదని నేరుగా చెప్పొచ్చు కదా? బాయిల్డ్‌ రైసు ఎగుమతి చేస్తూ.. చేయట్లేదని అబద్ధాలు చెప్తున్నారు. యాసంగి ధాన్యం మిల్లింగ్ చేస్తే క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం రాదు. యాసంగిలోనూ క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం ఇవ్వాలంటే కుదరదు. క్వింటాల్‌ వడ్లకు 34 కిలోల బియ్యమే వస్తుంది. 30 కిలోల తేడాను భరించేందుకు కేంద్రం ఒప్పుకోవట్లేదు.కేంద్ర ప్రభుత్వం ఆహర భద్రత బాధ్యతను విస్మరించింది.' - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు పెంచలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు పెంచలేదని... కేంద్రం మాత్రం ఎన్నోసార్లు ఎక్సైజ్‌ సుంకం పెంచిందని విమర్శించారు. కేంద్రం పన్నులు పెంచి... రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాలని అంటున్నారని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహారించడమే భాజపా సిద్ధాంతమని అన్నారు. కేంద్ర వైఖరి ప్రజలకు పూర్తిగా తెలియాల్సి ఉందని చెప్పారు. బ్యాంకులను వేల కోట్లు ముంచిన వ్యాపారులను కాపాడారని ఆరోపించారు. ఆర్థిక నేరగాళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details