బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లింది.. ఆర్డినెన్స్ కుదరదు: యనమల - మాజీ మంత్రి యనమల
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు.. మండలి సెలెక్ట్ కమిటీకి వెళ్లిందని.. ఇప్పుడు ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల చెప్పారు.

3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై.. ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమన్నారు.. మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. మండలి సెలెక్ట్ కమిటీకి వెళ్లాక ఆర్డినెన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమని స్పష్టం చేశారు. ''నిన్న మేం అడిగిన సెలెక్ట్ కమిటీ మండలికి సంబంధించి మాత్రమే. జాయింట్ సెలెక్ట్ కమిటీ అడగలేదు. జాయింట్ సెలెక్ట్ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. నేను సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా చేశా. సెలెక్ట్ కమిటీ ఏర్పడ్డాక ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో అభిప్రాయాలు తీసుకోవడానికి తగినంత సమయం అవసరం. ఈ ప్రక్రియ ముగియటానికి 3 నెలలకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి కనీస సమయం 3 నెలలు.. దీని అర్థం 3 నెలల్లోపు ఇమ్మని కాదు'' అని యనమల అన్నారు. మండలి రద్దు ఊహాగానాలపై ఆయన స్పందించారు. ఈ విషయంలో తాము ఎప్పుడూ బాధపడబోమని, భయపడేది లేదని చెప్పారు. నిన్న సభలోకి మంత్రులు తాగి వచ్చారని.. లోకేశ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సభలో ఎప్పుడూ చూడని పరిణామాలను నిన్న మంత్రులు ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.