కోనసీమ ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని రసాయన పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గతంలో ఓ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించిన వైకాపా.. అసలు రంగు ఇప్పుడు బయటపడిందని ఆరోపించారు. ఈ రసాయన పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములంతా ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుందన్న ఆయన.. 300లకు పైగా హేచరీస్ కాలుష్యంలో చిక్కుకున్నాయన్నారు. దీంతో చిరు వ్యాపారులంతా పూర్తిగా దెబ్బతింటారని స్పష్టం చేశారు.
బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యనమలు అన్నారు. కాకినాడ సెజ్‌లో 51 శాతం షేర్లను రూ. 2,511 కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేశారని మండిపడ్డారు. జగన్ బినామీలు బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు పేరుతో కోనసీమ గ్రామాలను కబ్జా చేస్తున్నారని, తీరప్రాంతాన్ని ఆక్రమించి వారి ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నారని యనమల ఆరోపించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల మానుకోవాలని ఆయన హితవు పలికారు. రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను తక్షణమే వైకాపా ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.