"ఆర్థిక ఎమర్జెన్సీని తలపించేలా..రాష్ట్రంలో పరిస్థితులు" - ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ
నవ కల్పనలకు సంబంధించి నీతిఆయోగ్ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో దేశంలో ఏపీకి పదో స్థానం లభించింది. దీనిపై మాజీ మంత్రి, తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఎలాంటి పెట్టుబడులు, ప్రైవేటు ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి లేదన్నది మరోసారి స్పష్టమైందన్నారు.
పెట్టుబడిదారులెవరూ రాష్ట్రంపై ఆసక్తి చూపడం లేదనేది నీతి ఆయోగ్ ర్యాంకులతో మరోసారి నిరూపితమైందని తెదేపా నేత యనమల దుయ్యబట్టారు. నవ కల్పనలకు సంబంధించి నీతిఆయోగ్ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రాష్ట్రం దేశంలోనే పదో స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో కర్ణాటక మొదటి ర్యాంకు సాధిస్తే... ఏపీ చిట్టచివరి ర్యాంకుకు పడిపోయిందన్నారు. జగన్ హయాంలో ఎలాంటి పెట్టుబడులు, ప్రైవేటు ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి లేదన్నది మరోసారి స్పష్టమైందన్నారు. తలసరి ఆదాయం 17వేల రూపాయలకు పడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో సులభతర వాణిజ్యంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచి ఎన్నో పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించామని గుర్తు చేశారు. ఆర్థిక ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులతో జాతీయస్థాయిలో రాష్ట్రం ప్రభ కనుమరుగవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని నిలదీశారు.