ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2020, 10:32 AM IST

ETV Bharat / city

'మద్యం తయారీ సంస్థల ఒత్తిడి మేరకే ధరలు పెంపు'

మద్యం ధరలు పెంపు సరికాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ధరల పెంపుతో ప్రజలపై 5 వేల కోట్ల భారం వేస్తున్నారన్నారు. మద్యం తయారీ సంస్థల ఒత్తిడి మేరకే ప్రభుత్వం ధరలు పెంచిందని ఆరోపించారు. ధరల పెంపుతో నాటుసారా, నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగిపోతాయన్నారు. ఎలుకల మద్యం తాగాయని కట్టుకథలు చెప్పి, మద్యం అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న మద్యం ధరల పెంపు నిర్ణయం సరికాదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం వేస్తున్నారని యనమల అన్నారు. మద్యం తయారీ కంపెనీల ఒత్తిడి వల్లే ధరలు పెంచారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతుందన్న యనమల.. నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని స్పష్టం చేశారు. వైకాపా నాయకులే నాటుసారా తయారీ వెనుక ఉన్నారని, వాలంటీర్లతో అమ్మిస్తున్నారని ఆరోపించారు.

మద్యం ధరలు పెంపుతో నాటుసారా తయారీ, నాసిరకం మద్యం అమ్మకాలు మరింత పెరిగిపోతాయని యనమల అన్నారు. లాక్​డౌన్ ఉన్నా మద్యం దొడ్డిదారిన తరలించి అక్రమ అమ్మకాలు జరిపారని విమర్శించారు. ఎలుకలు మద్యం తాగాయని చెప్పడం దారుణమన్న యనమల... వైకాపా పాలనలో ఏమైనా జరగొచ్చని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఇచ్చింది సగం అయితే గుంజుకున్నది రెట్టింపన్నారు.

పోషకాహారం అందించి వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఇతర రాష్ట్రాలు, విదేశాలు చేస్తుంటే ఏపీలో మాత్రం పోషకాహారం ఇవ్వకపోగా మద్యం అందుబాటులో ఉంచి, ధరలు 25 శాతం అదనంగా పెంచుతున్నారని ఆరోపించారు.

దశలవారీ మద్య నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన వైకాపా.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెద్దఎత్తున ఎందుకు తెరిచారని యనమల ప్రశ్నించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వైకాపా దారుణంగా మోసంచేసిందన్నారు. వైకాపా మోసాలకు బలైన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని యనమల అన్నారు. మద్యం ధరల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :నిమ్మగడ్డ పిటిషన్​పై హైకోర్టులో నేడు విచారణ

ABOUT THE AUTHOR

...view details