స్వలాభం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలతో రహస్య సమావేశాలు జరుపుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తన సంక్షేమం, బినామీల బాగు తప్ప రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాక్షేమం పట్టదని దుయ్యబట్టారు. రోజువారీ విచారణ ప్రారంభమైతే జైలుకెళ్లడం ఖాయమనే భయంతో సీఎం జగన్ ఉన్నారని విమర్శించారు. గత 17 నెలల్లో 10సార్లు దిల్లీ వెళ్లి రాష్ట్రానికి సాధించింది శూన్యమని మండిపడ్డారు.
స్వలాభం కోసమే కేంద్ర పెద్దలతో రహస్య సమావేశాలు: యనమల - Yanamala comments on Jagan
సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే.. స్వప్రయోజనాలే ముఖ్యమని మండలిలో ప్రతిపక్షనేత యనమల ఆరోపించారు. ఇన్నిసార్లు దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలనను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.
జగన్‌కు సంబంధించి సీబీఐ వద్ద 11, ఈడీ వద్ద 5కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజువారీ విచారణలో భాగంగా 365 రోజులూ విచారణకే హాజరుకావాల్సి ఉంటుంది. పరిపాలనను ఇప్పటికే గాలికొదిలేశారు. మోదీ, అమిత్ షాతో భేటీ అసలు రహస్యం జగద్వితమే. స్వలాభం లేకపోతే దిల్లీ పర్యటనపై కేంద్రమంత్రులతో ఉమ్మడి ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టరు..? కేంద్రాన్ని ఏం కోరారో, కేంద్రం ఏం ఇచ్చిందో రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పరు? లీక్‌లు, ప్రకటనల వెనుక రహస్యం ఏమిటి..? జైలు భయంతో జగన్ ఆందోళనలో ఉన్నారు. కళ్లు మూస్తే చంచల్గూడా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ముఖ్యమంత్రి మర్చిపోయారు. ఇకనైనా స్వప్రయోజనాలు మాని ప్రజాప్రయోజనంపై శ్రద్ధపెట్టాలి. -యనమల రామకృష్ణుడు, మండలిలో ప్రతిపక్ష నేత