రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలం అయ్యిందని... శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా వైరస్ వ్యాప్తి మరింత ఉద్ధృతం అవుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం మార్గదర్శకాలను, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని దుయ్యబట్టారు. వైరస్ నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని యనమల ఆరోపించారు.
కేంద్రం నిధులను దారి మళ్లించారు: యనమల - Yanamala comments on corona
కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర మార్గదర్శకాలు, ఆదేశాలను రాష్ట్రం బేఖాతరు చేస్తోందని ధ్వజమెత్తారు.
కోర్టు ఆదేశాలనూ అమలు చేయకుండా బేఖాతరు చేస్తున్నారన్న యనమల... రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలీసు అధికారుల బదిలీలను అమలు చేయలేదన్నారు. ఎన్నికల ప్రధానాధికారినే తొలగించారని దుయ్యబట్టారు. ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోతలు విధించారు గాని... ప్రభుత్వ సలహాదారుల జీతాల్లో కోతలు పెట్టలేదని పేర్కొన్నారు. 73, 74వ సవరణల ద్వారా భారత రాజ్యాంగంలో 9వ భాగం, 9(ఏ) భాగాలను పొందుపరిచారన్న యనమల... స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఈ భాగాల్లోని అంశాలను రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్