ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కానీ, ముందస్తు అనుమతి కానీ తీసుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక...ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదన్నారు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ అంతా ఎన్నికల సంఘమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. వాటిపై ఆర్డినెన్స్ ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని చెప్పారు. ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పలేదని గుర్తుచేశారు. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని తీర్మానం చేయడం కోర్టు ధిక్కరణే కిందకే వస్తుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో శాసన సభ పాత్ర ఏమీ ఉండదని గుర్తుచేశారు. ఇది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి, దానిపై రాష్ట్ర శాసనసభ సవరణ చేయలేదని.., దీనిపై రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఇవ్వలేరని తెలిపారు. రాజ్యాంగమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చిందన్నారు. ఇలాంటి తీర్మానం చేయడం ద్వారా వైకాపా ప్రభుత్వం మరో వింత సంప్రదాయానికి, వితండ వాదానికి తెరదీసిందని మండిపడ్డారు.