ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yanamala: 'విధ్వంస పాలనే జగన్‌ ప్రధాన ధ్యేయం'

వైకాపా రెండేళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన పుస్తకమంతా అసత్యాలేనని... శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆగిపోయాయని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు, విధ్వంస పాలనే జగన్‌ ప్రధాన ధ్యేయమని మండిపడ్డారు. క్రిమినల్ కేసుల నుంచి బయటకు రావడం కోసమే సీఎం జగన్ తాపత్రయమని యమనల విమర్శించారు.

Yanamala
Yanamala

By

Published : Jun 1, 2021, 11:08 AM IST

Updated : Jun 1, 2021, 12:01 PM IST

బడ్జెట్​లో ఖర్చు చూపించకుండా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఎకనామిక్ సర్వీసెస్​కి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న 36.32శాతం సగటు ఖర్చు.. గత రెండేళ్లలో 23.59శాతం మాత్రమే ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుతో రాష్ట్రానికి ఏం వనరులు కొత్తగా సృష్టించారని నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన రూ.17,826కోట్లు విలువ చేసే 17పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని యనమల దుయ్యబట్టారు.

జూమ్ సమావేశం ద్వారా విలేఖరుల సమావేశంలో యనమల మాట్లాడుతూ.. "రాష్ట్రంలో పేదరికం, ఆర్థిక అసమానతలు పెరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలే కారణం. పేదల ఆదాయం పడిపోవటానిక గల కారణాలపై సమాధానం చెప్పాలి. జీఎస్డీపీ, ఆహార రంగాల్లో నెగిటివ్ గ్రోత్ సూచిస్తోంది. భవిష్యుత్తులో ఆహారభద్రత సమస్య ఏర్పడే ప్రమాద ఘంటికలున్నాయి. ఏటా రూ.లక్షకోట్లు పైబడే చెల్లింపులకు పోతుంది. 2024నాటికి అప్పులు 6లక్షల కోట్లకు చేరుతుందా లేక 8లక్షల కోట్లకు వెళ్తుందో వేచి చూడాలి. వచ్చే మూడేళ్లు అప్పులు పెరిగి రెవెన్యూ పడిపోవటంతో తీవ్ర క్లిష్టపరిస్థితులు ఎదురుకానున్నాయి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న రాష్ట్రం కాస్తా అట్రాసిటీలకు గమ్యస్థానంగా మారనుంది." అని మండిపడ్డారు.

మహానాడులో రాజకీయ తీర్మానాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు:

మహానాడు వేదికగా చేసిన రాజకీయ తీర్మానాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని యనమల స్పష్టం చేశారు. కేంద్రానికి అంశాల వారీగా మద్దతు ఇవ్వడంలో తప్పేంటని ప్రశ్నించారు. "దేశ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలకు మాత్రమే మద్దతు ఇస్తామని తీర్మానంలో చెప్పాం. ప్రజలకు నష్ట చేసే నిర్ణయాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటలు అధికారంలో వచ్చాక జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ప్రత్యేకహోదా వస్తేనే ఉపాధి అవకాశాలు అని ప్రతిపక్షనేతగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడెందుకు అడగట్లేదో సమాధానం చెప్పాలి. క్రిమినల్ కేసుల నుంచి బయటకు రావాలనే తాపత్రేయంతోనే ప్రత్యేక హోదా విభజన హామీలు అడగట్లేదు. రెండేళ్లలో రాష్ట్రంలో రహదారుల గుంతలు కూడా పూడ్చలేదు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే రహదారుల పనులు ఆగిపోయాయి. కొవిడ్ సమయంలో ఎక్సైజ్ ఆదాయం ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలి." అని డిమాండ్ చేశారు.

పెట్రోల్ భారాన్ని రాష్ట్రం భరించాలి:

కేంద్రాన్ని ప్రశ్నించలేనప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని యనమల స్పష్టం చేశారు. "జీఎస్టీలో రాష్ట్ర వాటా గురించి ఆర్థిక మంత్రి ఏనాడు మాట్లాడలేదు. రెండో ఏడాది కూడా బడ్జెట్​ను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావటం ప్రభుత్వ వైఫల్యమే. దీనికి గవర్నర్ కూడా వత్తాసు పలకటం సరికాదు. దాహం వేస్తోందంటే బావి తవ్వండి అన్నట్లుగా సీఎం రెండేళ్ల పాలన తీరు ఉంది." అని ఎద్దేవా చేశారు.

అసత్యాలతో పుస్తకం విడుదల:

వైకాపా 2ఏళ్ల పాలనపై జగన్మోహన్ రెడ్డి పూర్తి అసత్యాలతో పుస్తకం విడుదల చేయటం ద్వారా తన చేతకాని తనాన్ని, అజ్ఞానాన్ని చాటుకున్నారని యనమల ధ్వజమెత్తారు. "నిజాలు చెప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిలో పుస్తకాన్ని విడుదల చేయటం అభ్యంతరకరం. అనివీతి సంపాదన, రాజకీయ కక్షసాధింపు, రాష్ట్రాన్ని ఎలా సర్వనాశం చేయాలనే అంశాలకే ప్రాధాన్యం ఇస్తూ.. అధికారాన్ని నిలబెట్టుకునే కాంక్షే జగన్మోహన్ రెడ్డిలో ఉంది. విధ్వంస పాలనే ప్రధాన ధ్యేయంగా అధికారం చేతిలోపెట్టుకుని ప్రతిపక్షాన్ని అణచివేసి ప్రజల్ని మభ్యపెడుతూ కాలక్షేపం చేయాలని చూస్తున్నారు. గత రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆగిపోయాయి. కుంభకోణాల ద్వారా అవినీతి సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. చట్టసభలు, పరిపాలన, న్యాయ, మీడియా వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తూ మంచి పాలన అందించామని ఎలా చాటుకుంటారు. పోలీసులతో రాజ్యం నడుపుతూ ప్రజారాజ్యం ఎలా అవుతుందో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన పుస్తకానికి కౌంటర్​గా తెదేపా పుస్తకం విడుదల చేసింది. వీటిపై వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది." అని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించిన సీనియర్ రెసిడెంట్ వైద్యులు

Last Updated : Jun 1, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details