సీఎం జగన్ కరోనాపై అవగాహనా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతుంటే వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారాసిటమాల్ వ్యాఖ్యలను మంత్రి బుగ్గన సమర్థించడమేంటని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కేంద్ర బలగాల రక్షణ ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వైకాపా వైఫల్యానికి ఇదో ఉదాహరణ అన్నారు. ఎస్ఈసీకే భద్రత లేకపోవడం రాష్ట్రంలో అభద్రతకు పరాకాష్ట అని విమర్శించారు.
కరోనా కామెడీలా ఉందా... కట్టడిపై నిర్లక్ష్యం ఏంటి..?: యనమల
కరోనా నివారణ చర్యలు చేపట్టకుండా సీఎం జగన్ కామెడీగా మాట్లాడుతున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలను మంత్రి బుగ్గన సమర్థించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో ఎస్ఈసీకే భద్రత లేదంటే... వైకాపా పాలన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందన్నారు.
పరిపాలన అంటే వైకాపా నేతలకు కామెడీగా మారిందని యనమల ఆక్షేపించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను వైకాపా నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో వైకాపాకు జ్ఞానోదయం కాలేదని, ఎస్ఈసీని తప్పుబట్టడం సుప్రీంతీర్పును అగౌరపరచడమేనని వ్యాఖ్యానించారు. ఎస్ఈసీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు చేయడం దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. కరోనా నివారణ చర్యలపై దృష్టిపెట్టకుండా ఈసీపై విమర్శలు చేసేందుకే వైకాపా ప్రాధాన్యమిస్తుందన్నారు. కరోనాపై కేరళ రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, హరియాణాలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇదీ చదవండి :కరోనా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు..?: యనమల