ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yadadri Temple Reopening: మార్చి 28 నుంచి యాదాద్రీశుని దర్శనం పునఃప్రారంభం - yadadri temple construction

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌ స్వామి ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. ఏరియల్‌ వ్యూ ద్వారా ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ కు వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి ఆయన వీఐపీ ప్రవేశద్వారం గుండా ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. వ్యూ పాయింట్ల వద్ద ఆగి అక్కడి దృశ్యాలను తిలకించారు.

Yadadri Temple Reopening
మార్చి 28 నుంచి యాదాద్రీశుని దర్శనం పునఃప్రారంభం

By

Published : Oct 20, 2021, 8:43 AM IST

"యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించాలంటే మహాకుంభ సంప్రోక్షణ చేయాలి. విద్వత్‌సభ, సిద్ధాంతుల సభను సమావేశపరిచిన అనంతరం చినజీయర్‌ స్వామి వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని ముహూర్తం నిర్ణయించారు. అంతకు వారం రోజుల ముందు మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు పునః ప్రారంభమవుతాయి" అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

ఈ క్రతువుకు 1.50 లక్షల కిలోల నెయ్యి వినియోగిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రసిద్ధ క్షేత్రాలు, వైష్ణవ పీఠాధిపతులు, అమెరికా తదితర దేశాల నుంచి అర్చకులు, అయిదారు వేల మంది రుత్విక్కులు, వారి సహాయకులు రానున్న దృష్ట్యా కొండ కింద ఉన్న 200 ఎకరాల్లో యాగం నిర్వహిస్తామన్నారు. ఆలయ పునఃప్రారంభం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేయాలన్న జీయర్‌స్వామి సూచన మేరకు ఈ ముహూర్త నిర్ణయం జరిగిందన్నారు. ‘చినజీయర్‌ స్వామి హైదరాబాద్‌ సమీపంలోని తమ ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒకే కాలంలో రెండు పెద్ద క్రతువులు నిర్వహించడం సులభం కాదు కనుక, యాదాద్రి ఉద్ఘాటన మార్చి 28న నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ వివరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఆయన మంగళవారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్లో క్షేత్రానికి చేరుకున్న టీసీఎం కేసీఆర్​... పనులను పరిశీలించారు.

సమైక్య పాలనలో ఆధ్యాత్మికంగానూ నిర్లక్ష్యమే

"సమైక్య పాలనలో తెలంగాణ ఆధ్యాత్మికంగానూ నిరాదరణకు గురైంది. శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారికి గతంలో ప్రాధాన్యమివ్వలేదు. స్వరాష్ట్రంలో అమ్మవారి ఖ్యాతిని ప్రాచుర్యంలోకి తెచ్చాం. మహోత్కృష్టమైన ఆలయాల్లో ఒకటైన యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేలా పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్‌ స్వామి సూచనలతో ఆలయ పనులు జరిగాయి. పునఃప్రారంభం తర్వాత కూడా తదుపరి నిర్మాణాలు కొనసాగుతాయి."- కేసీఆర్, తెలంగాణ సీఎం​

విమాన గోపురానికి వెల్లువెత్తిన విరాళాలు..

"యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించినట్టు టీసీఎం కేసీఆర్​ తెలిపారు. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమవుతోందన్నారు. ఈ పవిత్ర కార్యానికి తొలి విరాళంగా తమ కుటుంబం తరఫున ఒక కిలో 16 తులాల బంగారం ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి తొలి విరాళం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇస్తామంటూ పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను కేసీఆర్ మంగళవారం యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా సమకూరింది. హెటెరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారాన్ని విరాళమివ్వనున్నట్లు ప్రకటించారు. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చినజీయర్‌ స్వామి పీఠం నుంచి కిలో బంగారం, మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరఫున కిలో, మేడ్చల్‌ నియోజకవర్గ ప్రజల తరఫున కిలో, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి తన రెండు వస్త్ర సంస్థల తరఫున రెండు కిలోలు, కావేరి సీడ్స్‌ అధినేత భాస్కర్‌రావు కిలో, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు కిలో బంగారం, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్‌, ఎమ్మెల్సీలు కె.నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు, ఏపీలోని కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు.

ప్రతి గ్రామం భాగస్వామి కావాలి...

బంగారు తాపడానికి రూ.65 కోట్ల వరకు ఖర్చవుతుందని సీఎం తెలిపారు. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాదని... కానీ ఈ బృహత్‌ కార్యంలో ప్రతి గ్రామం భాగస్వామి అయి యాదాద్రి తమదే అనే భావన రావాలంటే ఎంతో కొంత విరాళం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. రిజర్వు బ్యాంకు నుంచి 125 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని కొని స్వర్ణతాపడానికి ఉపయోగిస్తామన్నారు. ఈ క్రతువుకు ఒక కమిటీని నియమిస్తామని వెల్లడించారు.

గోదావరి నీళ్లతో స్వామివారికి అభిషేకం

"కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నృసింహ (బస్వాపూర్‌) జలాశయం పనులు చివరి దశకు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి నిర్మిస్తున్న గండిచెరువు ప్రాంతానికి నిత్యం నీరు సరఫరా అయి కరవు సమస్య తీరుతుంది. పవిత్ర గోదావరి జలాలతో స్వామి వారికి నిత్యం అభిషేకం చేస్తారు. జలాశయం వద్ద రెండు గుట్టలున్నాయి. జలాశయం కింద 250 ఎకరాలు, గుట్టలున్న 200 ఎకరాలు.. మొత్తం 450 ఎకరాలు పర్యాటక శాఖకు అప్పగిస్తాం. అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్లు, మైసూర్‌ బృందావన్‌ గార్డెన్‌ తరహాలో గొప్ప కట్టడాలను నిర్మిస్తాం. యాదర్షి విశ్వవిద్యాలయం, యోగా కేంద్రం ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తున్నారు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం." - కేసీఆర్, టీసీఎం​

రూ.2 కోట్లతో ఒక్కో కాటేజీ నిర్మాణం

ఆలయ నగరిలోని వెయ్యి ఎకరాల్లో రూ.2 కోట్లకు ఒక యూనిట్‌ చొప్పున 250 కాటేజీల నిర్మాణాన్ని 2-3 రోజుల్లో ప్రారంభిస్తామని టీసీఎం తెలిపారు. ఒక్కో యూనిట్‌లో నాలుగు కుటుంబాలు.. అంటే ఒకేసారి వెయ్యి కుటుంబాలు బస చేయొచ్చన్నారు. ఆలయ ప్రారంభ ముహూర్తంలోపే ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కాటేజీలు నిర్మిస్తామంటూ ఇప్పటికే 50 మంది దరఖాస్తులిచ్చినట్టు వివరించారు. మంత్రి మల్లారెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ఒక్కో కాటేజీ నిర్మిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. కొండ కింద బస్‌బే, దాని పక్కనే కొండపైకి వెళ్లే బస్సు ప్రాంగణం నిర్మిస్తామని.. ఇందుకోసం ఆర్టీసీకి రూ.ఆరున్నర కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు.

మంత్రులకు పనుల బాధ్యత

"మార్చి28లోగా అన్ని పనులు పూర్తయ్యేలా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్‌ నుంచి జలమండలి అధికారులొస్తారు. ఇక్కడ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీతో పాటు, వరదల సమయంలో నీళ్లు పోయేలా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అర్చకుల కోరిక మేరకు వారికి అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం. జర్నలిస్టులకూ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఇళ్ల స్థలాలు కేటాయింపుపై కార్యాచరణ రూపొందిస్తాం" అని కేసీఆర్‌ వివరించారు. అంతకుముందు తెలంగాణ సీఎంకు ఆ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగడి సునీత, మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా తదితరులు స్వాగతం పలికారు. మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

బాలాలయంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

ధ్వజస్తంభం ఏర్పాటు కానున్న వేదికను పరిశీలించి తుది పనులపై సూచనలు చేశారు. బాహ్యవలయ రహదారి నిర్మాణంలో భాగంగా దుకాణాలు కోల్పోయిన వారికి కల్యాణకట్ట సమీపంలో వేయి గజాల చొప్పున కేటాయించి దుకాణాలు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చినజీయర్‌స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని ఆలయ ఈవో గీతారెడ్డికి టీసీఎం అందజేశారు. రామలింగేశ్వరాలయంలో అభిషేకం, అర్చన చేసిన కేసీఆర్ అక్కడే ఉన్న అతిథి గృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి భోజనం చేశారు. క్షేత్రం చుట్టూ నిర్మించిన బాహ్యవలయ రహదారిపై ప్రయాణిస్తూ కొండ కింద పూర్తయిన కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం నిర్మాణాలను పరిశీలించారు. తుది పనులపై పలు మార్పులు సూచించారు.

ఎన్నికల సంఘం పరిధి దాటిందనిపిస్తోంది

"హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించి... ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించిందేమో అనిపిస్తోంది. దళితబంధు కొనసాగుతున్న పథకం. దళితబిడ్డలెవరూ ఆవేదన చెందవద్దు. నవంబరు 4 తర్వాత అందరికీ స్వయంగా దళితబంధు నిధులను అందజేస్తా. ఎన్నికల సంఘం ఆదేశం చిన్న ఆటంకం మాత్రమే." - తెలంగాణ సీఎం కేసీఆర్‌

ఇదీ చూడండి:Kcr Gold Donation For Yadadri: 'యాదాద్రికి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం ఇస్తా'

ABOUT THE AUTHOR

...view details