Yadadri Temple: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దివ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా అద్భుతంగా రూపుదిద్దుకొంది. సువిశాలమైన ప్రాకారాలు, ఎతైన గోపురాలు, మండప సౌందర్యం, కృష్ణశిలా సోయగాలు, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో వైభవోపేతంగా విరాజిల్లుతోన్న క్షేత్ర ఉద్ఘాటనా క్రతువు పూర్తయింది. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి పూర్వాంగంగా ఈనెల 21 నుంచి నిర్వహించిన సప్తాహ్నిక దీక్షా పంచకుండాత్మక యాగం మహా పూర్ణాహుతి కార్యక్రమం నిన్న ఉదయం పూర్తయింది.
పల్లకి మోసిన సీఎం దంపతులు:అనంతరం బాలాలయంలో కొలువైన బంగారు కవచ, ఉత్సవ మూర్తులు, అల్వార్లను శోభాయాత్రగా ప్రధానాలయానికి తీసుకొచ్చారు. మాడవీధుల్లో ప్రదక్షిణ తర్వాత మూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వయంగా స్వామి వారి పల్లకి మోశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేదపండితులు అనుసరించారు. అనంతరం శ్రవణా నక్షత్ర మిథిలా లగ్నాన మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. దివ్య విమానంపై శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర గోదావరి జలాలతో అభిషేకం, సంప్రోక్షణ చేశారు. మిగతా గోపురాలు, మండపాలపై ఏర్పాటు చేసిన కళశాలకు మంత్రులు, ప్రముఖులు అభిషేకం చేశారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో 92 మంది రిత్వికులు ఏకకాలంలో ఈ క్రతువు నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో స్వయంభూల దర్శనాలు ప్రారంభం అయ్యాయి. తొలిపూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... సామాన్య భక్తులకు స్వయంభూ దర్శనానికి అవకాశం లభించింది. ఆలయ పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠామూర్తులను 2016 ఏప్రిల్‌లో బాలాలయంలోకి తరలించారు. అప్పటినుంచి బాలాలయంలోనే భక్తులకు స్వామి వారు దర్శనమిస్తున్నారు.