ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడే యాదాద్రి ఆలయ ఉద్ఘాటన.. తొలిపూజ చేయనున్న తెలంగాణ సీఎం - మహాకుంభ సంప్రోక్షణ

లక్ష్మీనారసింహులు నివసించే నవ వైకుంఠమది.. నిరంతర యజ్ఞయాగాలతో పునీతమై వేద ఘోష ప్రతిధ్వనించే పవిత్ర భూమి అది. చారిత్రక ప్రాశస్త్యం... ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ప్రాంగణం.. ఇకపై నవనవోన్మేషంగా, శోభాయమానంగా దర్శనమీయనుంది. ఇక్కడి పంచనార సింహుల క్షేత్రం ఒకప్పటిలా గుహాలయం మాత్రమే కాదు.. ఇప్పుడది దేశంలోనే తొలిసారిగా పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మితమైన దివ్యధామం. రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో.. ఇద్దరు స్థపతులు, 12 మంది ఉపస్థపతులు, 800 మంది శిల్పులు.. 1500 మంది కార్మికులు.. 66 నెలల పాటు శ్రమించి రూపుదిద్దిన మహాక్షేత్రమిది.. నేడు ప్రపంచాన్ని ఆకట్టుకునేలా.. తరతరాలూ నిలిచేలా రూపుదిద్దుకుంది.

YADADRI UDGHATAN
YADADRI UDGHATAN

By

Published : Mar 28, 2022, 4:56 AM IST

YADADRI UDGHATAN: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢసంకల్పంతో ఆవిష్కృతమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలకు శుభతరుణం ఆసన్నమైంది. సుమారు ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు పునఃప్రారంభం అవుతున్నాయి. సోమవారం ఉదయం జరిగే ఆలయ ఉద్ఘాటన మహాక్రతువుకు రంగం సిద్ధమైంది. మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్ఠామూర్తులతో ఉదయం 9.30 గంటలకు చేపట్టే శోభాయాత్రతో ఉద్ఘాటన క్రతువు మొదలవుతుంది. తొలుత శోభాయాత్ర ప్రధానాలయ రెండో మాడవీధిలో ప్రదక్షిణ అనంతరం తొలి మాడవీధిలోకి ప్రవేశించగానే మహాకుంభ సంప్రోక్షణ చేపడతారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. మిథునలగ్నంలో ఏకాదశి నాడు ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం కానుంది. అనంతరం 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. సరిగ్గా 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది.

ఎన్నెన్నో వసతులు..:ఆదివారం ఉదయం, రాత్రి వేళల్లో బాలాలయంలో పంచకుండాత్మక మహాయాగం, మూర్తి, మంత్ర హవనం, ప్రధానాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం, పంచశయ్యాధివాసం క్రతువులను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించామని ఆలయ ప్రధానార్చకులు నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహాచార్య వెల్లడించారు. నాలుగంతస్తుల క్యూకాంప్లెక్స్‌తో పాటు కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాదానికి దీక్షాపరుల మండపాన్ని ఆలయ ఈవో గీత ఆదివారం సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అందుబాటులోకి తెచ్చారు.

ముఖ్యమంత్రితో తొలిపూజ..:ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని ప్రథమ పూజలు చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రభుత్వ ముఖ్యులు సైతం పాల్గొంటారని అధికారవర్గాల సమాచారం. 12.30 గంటల నుంచి 20 నిమిషాల పాటు ప్రధానాలయంలో సీఎంకు వేదాశీర్వచనం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల అనంతరం భక్తులకు స్వయంభువుల సర్వదర్శనం మొదలవుతుంది. మహా క్రతువు ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ సునీత పరిశీలించారు.

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌..:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు చేరుకుంటారు. దర్శనాలు, పూజల అనంతరం క్షేత్రాభివృద్ధికి కృషిచేసిన వారందరినీ ఆలయ మాడవీధిలో ఆయన సన్మానిస్తారు.

2,000 మందితో భద్రత..:ఆలయ ఉద్ఘాటన మహాక్రతువుకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నందున దాదాపు 2,000 మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆదివారం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ కింద నుంచి పైకి రవాణా సౌలభ్యం కోసం ఆర్టీసీ ‘యాదాద్రి దర్శిని’ బస్సులను సిద్ధం చేసింది.

యాదాద్రి అద్భుతం.. ట్విటర్‌లో ఎమ్మెల్సీ కవిత..:యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ఒక అద్భుతమని, ధార్మిక, శిల్పకళానైపుణ్యం కళ్లకు కట్టేలా రూపుదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోని మహా దేవాలయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు.

ఇదీ చూడండి:Yadadri Night Visuals: విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్న యాదాద్రి

ABOUT THE AUTHOR

...view details