తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానాలయానికి ఉత్తరం వైపున గ్రీనరీ, మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక శోభ సంతరించుకునేలా, పచ్చదనం ఉట్టిపడేలా.. భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ల్యాండ్ స్కేపింగ్‌తో పాటు పొగడ మొక్కలు నాటుతున్నారు. ఇటీవల యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన సీఎంఓ భూపాల్ రెడ్డి సూచనల మేరకు ప్రధానాలయం పరిసరాల్లో గ్రీనరీతో పాటు మొక్కల పెంపకం చేపట్టారు.
మందిర రూపంలో రథశాల
ప్రధానాలయ ప్రాంగణంలో స్వామి వారి దివ్యవిమాన రథాన్ని భద్రపరిచేందుకు నిర్మితమవుతోన్న ప్రత్యేక రథశాలను.. మందిర రూపంలో తీర్చిదిద్దేందుకు యాడా ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 30 అడుగుల ఎత్తులో ఏర్పాటయ్యే రథశాలకు వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా స్థూపాలు, స్వాగత తోరణాలు ఆవిష్కృతం కానున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన బంగారు, వెండి తొడుగులను ఆలయానికి చేర్చారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల్లో నడవలేని వారి కోసం ఏర్పాటవుతున్న ఎస్కలేటర్‌ను సైతం ఆధ్యాత్మికంగా రూపొందిస్తున్నారు.