వేగంగా అవతరించి వేగంగా చాలించిన అవతారుణ్ని క్షిప్రావతారుడు అంటారు. ఆ దైవం క్షిప్రప్రాసాదుడని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటారు. కోరిన కోర్కెలను తక్షణమే తీర్చే క్షిప్రవరప్రసాదుడు ఈ నరసింహుడు. సహధర్మచారిణి అయిన లక్ష్మీసహితుడై ఉంటే నరసింహుడు పరమశాంత స్వరూపుడని వేదవిద్యావేత్తలు, నృసింహ ఉపాసకులు అంటారు. భౌగోళికంగా ఈ యాదగిరిగుట్ట నరసింహుడు స్వయంభువుగా వెలవడానికి యాదమహర్షి కారకుడైతే, ఈ నృసింహావతారానికే కారకుడు భక్తప్రహ్లాదుడు. అటువంటి భక్తశిఖామణి చరిత్రను సచిత్రంగా చూసి భక‌్తులు పరవశులవ్వాలని ఆలయ మహాముఖమంటపంలోకి చేరిన యాత్రికుల కనుల ముందు కనబడేలా ఏర్పాటుచేశారు.
ప్రహ్లాదవరద నరసింహా శరణు శరణు
ఉగ్రనృసింహుణ్ని శాంతరూపుడై కొలువై ఉండమని తపమాచరించిన యాదమహర్షి దర్శనం క్షేత్ర ప్రవేశంలోనే అవుతుంది. ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదమహర్షి శ్రీ నరసింహమూర్తి ఉగ్రరూపం చూడాలనే కోరికతో ఈ గుహలో తపస్సు చేయగా, క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడి సహకారంతో నృసింహుడు ప్రత్యక్షమయ్యాడని స్థలపురాణం. అసలు పురాణం ప్రకారం నరసింహావతారానికి ప్రేరేపకుడు, కారకుడు అయినవాడు పరమవైష్ణవ భక్తాగ్రేసరుడయిన ప్రహ్లాదుడు. ప్రహ్లాద భక్తాభీష్ట వరప్రదాయకుడుగా వెలసిన స్వామి నరమృగ స్వరూప నారసింహస్వామి. అందుకే ఈ ఆలయానికి వచ్చే భక్తులు "ప్రహ్లాదవరద నరసింహా శరణు శరణు" అంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు.
వర్ణరంజిత తైలవర్ణ చిత్రరాజం
మాడవీధులలోని అష్టభుజి ప్రాకార మంటపాల స్తంభాలపైన, ఆలయ కుడ్యాలపైనా నారసింహ ప్రహ్లాదుల ప్రతిమలనేక చోట్ల శిల్పీకరించారు. తూర్పుమాడవీధిలోని ప్రవేశద్వారం లోంచి అంతర ప్రాకారంలోకి రాగానే ఈశాన్యదిక్కున ఉన్న మూడుఅంతరవుల రాజగోపురం కనిపించి ఆహ్వానిస్తుంది. ఆ ప్రవేశద్వారంలోంచి దిగువమట్టంలోని గుహాకార మహా ముఖమంటపానికి దిగే మెట్లదారి ఉంటుంది. ఆ దారికి ఇరువైపులా కృష్ణశిలా నిర్మిత గోడలపై కృష్ణశిలా మూర్తులుగా దశావతార చిరుమూర్తులు, హనుమ, రామానుజాచార్యుల వారితో పాటు యాదర్షి కృష్ణశిలా ప్రతిమ అమరి ఉంటుంది. నాగర, వేసర, ద్రావిడశిల్పశైలిల ఏనుగులు, వ్యాళ జంతువులు, వివిధ లతయుక్త నగిషీలు శిల్పుల ఉలులు చెక్కాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయుని దర్శించుకుని పంచలోహ బారికేడ్ల క్యూలైన్ లో మహాముఖమంటపంలోకి తీర్థయాత్రీకులు ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన భక్తులకు సర్వం సకలం విష్ణుమయమే అన్నంతగా వేరే ధ్యాస అనేది లేకుండా ఆవరణంతా వెలుగులీనుతుంది. స్తంభాలకు నిలబడ్డ భంగిమలో పన్నెండు మంది ఆళ్వార్లను చూస్తూ ముందుకు కదిలి గర్భాలయ ముఖద్వారం ముందుకు రాగానే ఆ ద్వారం పైకి చూపులు ప్రసరిస్తాయి. ఎడమవైపున లక్ష్మీదేవి, నరసింహస్వామివార్ల కళ్యాణ కమనీయ ఘట్టం వర్ణరంజిత తైలవర్ణ చిత్రరాజం మహా ఆకర్షణీయమై కనిపిస్తుంది. ఆ పక్కనే గర్భాలయ ద్వారం పైన ఎడమ వైపు నుంచి కుడివైపుకి తెలుగు భాషా లిపి వరుసక్రమంలో పంచలోహంతో తయారైన పదిపలకలపై ప్రహ్లాద చరిత్ర భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరిస్తుంది
నవ్య యాదాద్రి ఆలయంలో యాదాద్రి అభివృద్ధి సాధికారక సంస్థ యాడా ప్రహ్లాద చరితం విశిధపరిచే ఓ చక్కటి ఏర్పాటు చేసింది. ఏడు అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో పది రజిత పలకాలను తయారుచేసింది. దాదాపు 250 కేజీల వెండిని ఉపయోగించి తయారుచేసిన ఈ పది పలకాలు ప్రహ్లాద చరితాన్ని సామాన్యులకు సులువుగా అర్ధమయ్యేలా రూపొందించారు.
1. తన అన్న అయిన హిరణాక్షుణ్ని వరాహావతార విష్ణువు సంహరించాడని ఆగ్రహంతో హిరణ్యకశిపుడు అతీత శక్తులకోసం బ్రహ్మగురించి తపమాచరిస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వగానే తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని మరణం లేకుండా వరం కావాలని అడుగుతాడు. బ్రహ్మ వరాన్ని పొందిన హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతూ దేవతలను, ఋషులను హింసిస్తాడు.
2. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు మొర పెట్టుకోగా ఇంద్రుడు గర్భవతియైన హిరణ్య కశిపుని భార్య లీలావతిని బంధించి ఇంద్రలోకానికి తీసుకువెళతాడు. ఆమె గర్బములోనున్న వాడిని చంపబోగా, నారదుడు వారించి ఆమె గర్భములో పుట్ట బోయే వాడు దేవతలకు మిత్రుడౌతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమములో సేద దీర్చుతాడు. నారదుడు ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి, ఆమె గర్భములో వున్న ప్రహ్లదునికి విష్ణు భక్తిని బోధించి గర్భస్థ ప్రహ్లాదుణ్ని విష్ణుభక్తునిగా తీర్చిదిద్దుతాడు.
3. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను, పసిబాలుడైన ప్రహ్లాదుణ్ని నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళతాడు. సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.