World Suicide Prevention Day 2022 : తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారంగా చాలా మంది ఆత్మహత్యలను ఎంచుకుంటున్నారు. జీవితం విలువ తెలుసుకోలేక క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి కాటికి కాలు చాపిన వృద్ధుల వరకు చాలా మంది తమ సమస్యలను ఎదుర్కోలేక, ఒత్తిడి తట్టుకోలేక చావే పరిష్కారమని భావిస్తూ తమ ఆత్మీయులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలవరపరిచేలా పోలీసుల అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు సగటున ఇద్దరు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య రెండింతలుగా ఉంటోంది.
Suicide cases in Karimnagar : ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్యలతో కలిసి నేటి రోజున ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతూ.. వ్యక్తుల్లో మానసిక స్థితిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవ ఏర్పాటుకు కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మానసిక వైద్యుల చేత అవగాహన సదస్సుల్ని నిర్వహిస్తారు.
క్షణకాలపు ఆవేశంలో..తెలంగాణ రాష్ట్రంకరీంనగర్ సమీపంలోని ఎల్‌ఎండీ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఇప్పటివరకు వచ్చిన సుమారు 200 మందిని ఇక్కడి లేక్ పోలీసులు ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఇప్పుడు బతుకుమీద ఆశతో వారంతా కొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
- ఈ ఏడాదిలో ఆగస్టు నెలాకరు వరకు 243 రోజుల్లో 579 మంది తనువు చాలించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా జరుగుతున్నాయి. చనిపోయిన వారిలో 35 ఏళ్ల లోపు వారే దాదాపుగా 40శాతానికిపైగా ఉంటున్నారు.
- ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని మానసిక వైద్య నిఫుణులు చెబుతున్నారు. కుటుంబ కలహాలతో ఒకరికన్నా ఎక్కువ మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటనలు జిల్లాలో ఉన్నాయి.
- ఉమ్మడి జిల్లాలో గోదావరి నది సహా వరద కాలువ, జలాశయాల్లోనే కొందరు ఆత్మహత్యలకు కేంద్రాలుగా మలచుకుంటున్నారు. పోలీసులు వీటి చెంతన పహారా కాస్తూ వేదనతో వచ్చే వారిని గుర్తిస్తూ బతకాలనే ధైర్యాన్నిస్తున్నారు.
- మాటపడని మనస్తత్వం, సూటి పోటీ మాటలు, తప్పుచేశామనే భావనతో 50 ఏళ్లపైబడిన వారు ఈ తరహా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒంటరి వేదనతో ఉన్న వీరికి మాటల భరోసా దొరికితే ప్రాణాలు నిలిచే వీలుంది.
- ప్రేమ జంటల ఆత్మహత్యలు కూడా జిల్లాల్లో పెరిగాయి. సగటున రెండు నెలలకో సంఘటన చోటు చేసుకుంటుంది. పెద్దవాళ్లని ఎదిరించే సాహసాన్ని చేయక.. అనాలోచిత నిర్ణయం, విడిగా ఉండలేమనే బాధతో చనిపోతున్న తీరు కలవరపరుస్తోంది.
చిన్నారుల మనసుల్లోనూ..కల్లోలం..నాలుగు జిల్లాల పరిధిలో ఈ ఏడాదిలో చిన్నారుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. చరవాణి కొనివ్వలేదని, ద్విచక్రవాహనం వద్దన్నారని.. మార్కులు తక్కువగా వచ్చాయని ఇలా చిన్నపాటి సాకులతో ప్రాణాలు తీసుకుంటున్నారు. సరైన తరహాలో వారికి జీవితం విలువల్ని తెలియజెప్పకపోవడంతోపాటు వారి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయకపోవడంతో ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఉజ్వలమైన భవిష్యత్తుని గుర్తించక.. మధ్యలోనే ఊపిరిని నిలుపుకొంటున్న విషాద ఘటనల వల్ల వారి కన్నతల్లిదండ్రులకు బతుకంతా కడుపుకోతనే మిగులుతోంది. ఈ ఏడాదిలో సుమారుగా 25 మంది 15 ఏళ్ల లోపు చిన్నారులిలా చనిపోవడం బాధాకరం.
ఇలా గుర్తించండి.. "ఉల్లాసంగా ఉన్నవారు మౌనంగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం, చిరాకువ్యక్తం చేయడం, ఈ బతుకంటే ఏ మాత్రం ఆశలేదనే మాటలు మాట్లాడటం లాంటితీరుంటే అనుమానించాలి. వారిపై తగిన దృష్టిని పెట్టాలి. సకాలంలో మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. ఓటమి గురించి అదేపనిగా వారిని ఆలోచించనివ్వకుండా జీవితంలో గెలుపొందిన వారి జీవితకథల్ని తెలియజేయాలి. భావోద్వేగాలను నియంత్రించుకోలేకనే ఇలాంటి మరణాలతో జీవితాల్ని చాలా మంది కోల్పోతున్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే బతుకు బాగుంటుంది." - శ్రీనివాస్‌రెడ్డి, మానసిక వైద్యనిఫుణులు, కరీంనగర్