ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ షెడ్ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. సచివాలయంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సమావేశమైన ప్రపంచబ్యాంకు ప్రతినిధులు... వచ్చే ఐదేళ్లలో ఏపీకి దాదాపు 70 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేశారు.
70శాతం నిధులు ప్రపంచ బ్యాంకు నుంచే..!
ఈ ప్రాజెక్టు కోసం 70 శాతం నిధులు ప్రపంచబ్యాంకు ఇవ్వనుండగా... 30 శాతం నిధులు ప్రభుత్వం సమకూర్చనుంది. తొలివిడతలో తక్కువ వర్షపాతం ఉండే రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కింద నీటి ఎద్దడి ప్రాంతాల్లో జల వనరుల సంరక్షణ, ఆధునిక నీటి యాజమాన్య విధానాల ద్వారా... నీటి వనరులను సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలు చేపడతారు.