రైతు బిడ్డకు ఉత్తమ ర్యాంకు
‘మానాన్న రైతు. పేరు నూని శ్రీనివాస చౌదరి, తల్లి కృష్ణవేణి. తాతయ్య చింతపల్లి కామేశ్వరరావు వైద్యులు. కొవిడ్ సమయంలోనూ అతను చేసిన వైద్య సేవలతో స్ఫూర్తి పొందా. వైద్య వృత్తిని చేపట్టి సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రణాళికాబద్ధంగా చదివి ర్యాంకు సాధించా. దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరాలన్నది నా కోరిక. కార్డియాలజీ వైద్య నిపుణురాలిగా సేవలందించాలని భావిస్తున్నా’. -నూని వెంకట సాయి వైష్ణవి (జాతీయ స్థాయి ర్యాంకు: 15, కాకినాడ జిల్లా, కైకవోలు)
కార్డియాలజిస్ట్ అవుతా
‘దిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ కావాలన్నది నా ఆశ. చాలామంది గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి సేవ చేయాలనే ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నా. తండ్రి ఎం.నరసింహ పూతలపట్టు మండలం పోలవరం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అమ్మ ప్రభావతి గృహిణి.’ -ఎం.హర్షిత్ రెడ్డి (36వ ర్యాంకు, తిరుపతి)
చాలా ఆనందంగా ఉంది
‘దిల్లీలోని ఎయిమ్స్‌లో సీటు సాధించాలన్న లక్ష్యంతో చదివా. నీట్లో మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. వైద్యురాలిగా రాణించాలన్నదే నా లక్ష్యం. నా తండ్రి పేరు సుదర్శన్‌రెడ్డి. ఆర్టీపీపీలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శ్రీవాణి.. వైద్యురాలు.’ -చప్పిడి లక్ష్మీచరిత(ర్యాంకు: 37, ప్రొద్దుటూరు)
అమ్మమ్మ మృతితో కలతచెంది వైద్య రంగాన్ని ఎంచుకున్నా
‘నా చిన్నప్పుడు గ్రామంలో వైద్యసేవలు అందక అమ్మమ్మ మరణించింది. అప్పుడే తాను డాక్టరు చదివి గ్రామీణప్రాంత వాసులకు, పేదలకు సేవలు అందించాలని నిర్ణయించుకున్నా. విజయవాడలో శిక్షణ పొందా. రోజుకు 16 గంటల పాటు కష్టపడి చదివా. తండ్రి సోమయ్య పురపాలకసంఘంలో ఉద్యోగి.’ -చందాల యశస్వినిశ్రీ(ర్యాంకు:52, కోదాడ)
రోజుకు 16 గంటలు చదివా
‘డాక్టర్ కావాలన్నది నా లక్ష్యం. రోజుకు 16 గంటల పాటు కష్టపడి చదివా. సబ్జెక్టుల్లో ఉన్న సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకొని లక్ష్యాన్ని చేరుకున్నా. తండ్రి రామకృష్ణారెడ్డి వైద్యుడు, తల్లి సౌభాగ్య.’ -వి.సేవితలాస్య, (ర్యాంకు-56, ఒంగోలు)
న్యూరో సర్జన్ కావాలన్నది లక్ష్యం
‘రోజుకు 16 గంటల పాటు చదివి ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్ కావాలన్నది నా లక్ష్యం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. నీట్ ర్యాంక్ సాధించేందుకు హైదరాబాద్‌లో కొంతకాలం శిక్షణ పొందా. తెలంగాణ ఎంసెట్‌లో 16, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో 36వ ర్యాంకులు సాధించా.’ - వంశీధర్‌రెడ్డి(ర్యాంకు:62, నంద్యాల)