ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్రీడల్లో యువ మహిళా కెరటాలు.. - మహిళా దినోత్సవ ప్రత్యేక కథనం

ఆమె ఒక అద్భుతం.. తల్లిగా, చెల్లిగా, భార్యగా.. ఆమె ప్రతి పాత్ర అనిర్వచనీయం. మహిళగా ఇంటి బాధ్యతనే కాదు.. ఉద్యోగిగా వృత్తి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తుంది. ప్రతిరంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న 'ఆమె'.. క్రీడారంగంలోనూ దూసుకుపోతోంది. గత 2 దశాబ్దాల నుంచి ఆటల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. వివక్షతలను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి క్రీడల్లో మెరుస్తున్నారు. మిథాలీ, మేరీకోమ్, అశ్వనీ నాచప్పల బాటలో నడుస్తూ.. ఎందరో 'యంగ్ ప్లేయర్స్' వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ క్రీడామణులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..!

womens day special
క్రీడల్లో యువ మహిళా కెరటాలు..

By

Published : Mar 8, 2020, 8:46 AM IST

Updated : Mar 8, 2020, 11:47 AM IST

వివిధ క్రీడల్లో రాణిస్తున్న యంగ్ తరంగాల గురించి ప్రత్యేక కథనం..

క్రికెట్​లో 'షెఫాలీ' షో

జెంటిల్​మెన్​ గేమ్​గా పిలుచుకునే క్రికెట్​లోకి మిథాలీ రాజ్, జులన్ గోస్వామిల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ.. ఎందరో అమ్మాయిలు అడుగుపెట్టారు. వారిలో నయా సంచలనం షెఫాలీ వర్మ ఒకరు. 16 ఏళ్ల పిన్న వయస్సులోనే భారత జట్టుకు ప్రాతనిథ్యం వహించి సచిన్ రికార్డును బద్దలు కొట్టిన షెఫాలీ.. బ్యాటుతోనూ విజృంభిస్తోంది. లేడీ సెహ్వాగ్​గా పేరు తెచ్చుకుని విశేషంగా రాణిస్తోంది. ఓపెనర్​గా బరిలోకి దిగి బంతిని బలంగా బాదుతూ సిక్సర్లు కొట్టే ఈ అమ్మాయి.. జట్టుకు శుభారంభాలు అందిస్తోంది. ఇప్పటివరకూ కెరీర్​లో 18 మ్యాచ్​లు ఆడి 485 పరుగులు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు ఫైనల్​కు చేరిందంటే.. అందుకు ఆమె బ్యాటింగే ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు.

షెఫాలీ వర్మ

టేబుల్​ టెన్నిస్​లో మానికా, నైనా

హైదరాబాద్​లోని కాచిగూడ డివిజన్ కుత్బిగూడలో ఉంటున్న నైనా జైస్వాల్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. భారత్​ నుంచి 'ఐటీటీఎఫ్ వరల్డ్ హోప్స్ టీం - 2011' ఎంపికైన మొదటి అమ్మాయి నైనా. అండర్ - 12 విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్​లో ఆరో స్థానంలో ఉంది. పలు జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో టైటిళ్లు గెలుచుకుంది. క్రీడల్లోనే కాదు చదువులోనూ సంచలనాలు సృష్టిస్తోంది నైనా. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ అభ్యసిస్తోంది.

మానికా బత్ర

దిల్లీకి చెందిన మానికా బత్ర.. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ ఆటలో రెండు స్వర్ణాలతో సహా నాలుగు పతకాలను కొల్లగొట్టింది. ఈ క్రీడలో అత్యంత విజయవంతమైన భారత అథ్లెట్‌గా పేరుగాంచింది. ఆసియా క్రీడల్లో మిశ్రమ డబుల్స్​లో శరత్ కమల్​తో జతకట్టి కాంస్య పతకాన్ని గెలుచుకుని.. భారత్ తరఫున ఈ క్రీడల్లో అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసింది. 23 ఏళ్ల బత్రా టేబుల్ టెన్నిస్​లో తన హవా చూపిస్తోంది.

మానికా బత్రా

ట్రాక్​పై 'హిమ' పరుగులు

స్ప్రింట్ సంచలనం హిమదాస్.. అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్. ఫిన్లాండ్‌లో జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ - 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల ఫైనల్ రేస్‌లో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. హిమకు ముందు ఏ మహిళా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించలేదు.

హిమదాస్​

రింగ్​లో 'వినేశ్' పట్టు

గీతా, బబితా ఫోగాట్​ల తర్వాత మహిళా రెజ్లింగ్​లో వినేశ్ ఫోగాట్ సత్తా చాటుతోంది. ఆసియా గేమ్స్ 2018లో వినేష్ ఫోగాట్ బంగారు పతకం సాధించింది. హర్యానాలోని తమ గ్రామంలో సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి, వ్యతిరేకతను ఎదుర్కొని మరీ రింగ్​లో మెరిసింది.

వినేశ్​ ఫోగాట్​

వీరితోపాటు మరెందరో అమ్మాయిలు క్రీడల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలిపేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

అతను నాన్న కాదు.. 'ఉత్తమ అమ్మ'

Last Updated : Mar 8, 2020, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details