ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళా"మణులు".. స్వచ్ఛతకు సారథులు

ఉపాధి కాస్తా.. వారిలో ఆసక్తి పెంచింది. పని చేస్తున్న రంగంలోనే రాణించేలా వారంతా నైపుణ్యం పెంచుకున్నారు. ఆటో డ్రైవర్లు అంటే మగాళ్లేనా.. తాము కూడా నడపుతామంటూ ధైర్యంగా ముందడుగు వేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ ఆటోలకు చోదకులుగా మారి చెత్తను తరలిస్తున్నారు. స్వచ్ఛతలో తామూ భాగమవుతున్నారు.

women drives autos
మహిళా "మణులు".. స్వచ్ఛతకు సారథులు

By

Published : Jan 5, 2021, 6:32 PM IST

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా ప్రతిరోజు 60 డివిజన్ల నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల తప్ప మిగతా అన్ని డివిజన్లలో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలను ప్రవేశ పెట్టారు. ఎంపిక చేసిన కార్మికులు ఆయా డివిజన్‌లలో చెత్త సేకరణ చేపడుతున్నారు. ఎక్కువ శాతం భర్త ఆటో నడిపిస్తే.. భార్య సహాయకులుగా ఉండి ఇంటింటా చెత్తను తీసుకుంటారు. ఇలా నగరంలో ప్రతిరోజు తడి, పొడి చెత్త సేకరణ జరుగుతుండగా..కొన్ని డివిజన్లలో మహిళలే స్వచ్ఛ ఆటోలకు డ్రైవర్లుగా పని చేస్తూ చెత్తను డంపింగ్‌యార్డుకు తీసుకొని వెళ్తు గుర్తింపు పొందుతున్నారు.

స్వచ్ఛ ఆటోలు నడుపుతున్న మహిళా కార్మికులు

జీవనోపాధి కోసం చెత్త సేకరణ వైపు కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. కొందరికి స్వచ్ఛ ఆటోలు ఇవ్వగా మరికొందరు సొంతంగా ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి నగరపాలిక తరఫున ఎలాంటి జీత, భత్యాలు, ఇంధనం ఖర్చులు ఇవ్వదు. ఆటోకు 500 ఇళ్లను కేటాయించి ప్రతినెలా రూ.50 వసూలు చేసుకునేలా చర్యలు చేపట్టింది. అదనంగా పొడి చెత్తను కొనుగోలు చేసేందుకు నగరపాలిక డీఆర్‌సీసీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి స్వచ్ఛ ఆటో కార్మికుడు పొడి చెత్తలో పనికి రాని వస్తువులు అమ్ముకొని రూ.300 సంపాదిస్తున్నారు.

40 మందిలో.. ఆరుగురు ప్రత్యేకం
స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ చేస్తుండగా ఇందులో సుమారు 40మంది మహిళలు సహాయకులుగా పని చేస్తున్నారు. ఆరుగురు మహిళలు మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. వీరు ప్రతిరోజు భర్తలతో పాటు చెత్త సేకరణ చేస్తూ మూడు, నాలుగు చక్రాల ఆటోలను నడిపించడం నేర్చుకున్నారు. గత ఏడాది నుంచి సొంతంగా ఆటోలు నడిపిస్తూ చెత్తను సేకరిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేటాయించిన ఇళ్ల నుంచి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు.

ఏడాది నుంచి నడిపిస్తున్నా
- వాణి, స్వచ్ఛ ఆటో మహిళా డ్రైవర్‌, కార్మికురాలు
50వ డివిజన్‌లో భర్తతో కలిసి చెత్త సేకరణ చేశాను. డివిజన్‌లో రెండు ఆటోలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో భర్త సహకారంతో నేర్చుకున్నాను. లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నా. ప్రస్తుతం ఏడాది నుంచి ఆటో నడిపిస్తూ ఉపాధి పొందుతున్నా. రుణం ఇప్పిస్తే మరింత ముందుకు వెళ్తా.

సొంతంగా ఆటో కొనుగోలు
- సమ్మక్క, స్వచ్ఛ ఆటో మహిళా డ్రైవర్‌, కార్మికురాలు
సొంతంగా ఆటోను రుణంపై తీసుకుని ఉపాధి పొందుతున్నా. గత ఎనిమిది నెలలుగా ఆటో నడిపిస్తున్నా. ఇంతకుముందు నగరంలో నడిపించగా ప్రస్తుతం అలుగునూర్‌లో ఆటో నడుపుతూ చెత్త సేకరణ చేస్తున్నాను. లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాను.

శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తాం
- క్రాంతి వల్లూరు, కమిషనర్‌, కరీంనగర్‌ నగరపాలిక
మహిళా డ్రైవర్లుగా రాణిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. ఆర్టీసీ సంస్థ ద్వారా చిన్న, భారీ వాహనాలు నడిపిస్తున్న వారికి శిక్షణ ఇవ్వాలని లేఖ రాశాం. స్వచ్ఛ ఆటో మహిళా డ్రైవర్‌కు షీ బస్సు నడిపించేలా శిక్షణ ఇవ్వాలని కోరాం. స్వచ్ఛ ఆటోలో పని చేస్తున్న మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యం ఇస్తాం.

వెను వెంటనే కొనుగోలు
- భాగ్యవతి, డీఆర్‌సీసీ నిర్వాహకురాలు
డంపింగ్‌యార్డుకు తీసుకొచ్చిన పొడి చెత్తలో అమ్ముకోవడానికి వచ్చే వస్తువులను వెను వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుంది. వీరు తీసుకొచ్చిన చెత్తను విక్రయించడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయి.

ఇదీ చదవండి:

విశాఖ కాఫీ తోటల కథ...

ABOUT THE AUTHOR

...view details