ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోగులకు అన్నీ తామై.. స్త్రీమూర్తుల సేవలు - మహిళా దినోత్సవం 2021 ప్రత్యేక కథనాలు

ఆమె మమతకు ప్రతిరూపం.. దక్షతలో దీక్షాధారి.. ఓర్పులో భూదేవి.. కరుణకు చిరునామా.. కరోనా కష్టమొస్తే అమ్మలా కన్నీళ్లు తుడిచింది. భరించలేని బాధల్లో తోబుట్టువై ఓదార్చింది. ఒంటరి అయిన రోగిని వెన్నంటి నడిపించింది. అష్టభుజిగా మారి అండగా నిలిచింది. సొంత మనుషులు కూడా చేయలేనంత సహనంతో ఆర్తులకు సేవలందించింది. మృత్యువుతో పోరులో బాధితులు ఓడిపోతే ఆమె మనసు కన్నీరైంది. వారు కోలుకొని ఇంటికెళ్తుంటే ఆనందబాష్పాలు రాల్చింది. గత ఏడాది మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో మహిళామణులు అందించిన సేవలు నిరుపమానం. తమ పిల్లలు, కుటుంబసభ్యులను రోజుల తరబడి కలవలేని స్థితిలోనూ ఆ తల్లులు విధి నిర్వహణకే అంకితమయ్యారు. కనిపించని శత్రువుతో యుద్ధం చేసి, ఎంతోమంది రోగులను విజేతలుగా ఇళ్లకు పంపారు. తమ ఆత్మస్థయిర్యం ముందు కొవిడ్‌ బలాదూర్‌ అని నిరూపించారు. వైరస్‌ వ్యాపించిన వాడలను మూసేసి, రాకపోకలను కట్టడి చేసిన సమయంలో ఇరుకు సందుల్లోనూ ఇంటింటికీ తిరిగి బాధితుల సమాచారం సేకరించారు. ఒకరా ఇద్దరా.. వైద్య, వైద్యేతర సిబ్బందిలో ఎందరో కారుణ్యమూర్తులు.

women role in fight against corona
women role in fight against corona

By

Published : Mar 8, 2021, 7:23 AM IST

కరోనా సృష్టించిన కల్లోలం తలచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. మానవాళిని మహమ్మారి అతలాకుతలం చేసింది. మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేసింది. ఎవరికి వారేగా... రోగులు ఏకాకుల్లా మిగిలిన పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందుకొచ్చి సేవలందించారు వైద్యులు, ఆసుపత్రుల్లో సిబ్బంది. వీరిలో మహిళామూర్తుల సేవలు అనన్య సామాన్యం. ఒకవైపు కుటుంబ బాధ్యతలను మోస్తూనే.. అంతకంటే కఠినమైన కొవిడ్‌ సవాలునూ సమర్థంగా ఎదుర్కోవడంలో కృతకృత్యులయ్యారు వారు. వైద్యులు, నర్సులు, ఆయాలు, ఆశాలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, స్వచ్ఛంద సేవకులు.. ఒకరేమిటి.. విలయ సమయంలో విశ్వరూపం ప్రదర్శించి పోరాడిన వారెందరో. అటువంటి కొందరిని ‘ఈనాడు’ పలకరిస్తే, వారి మనసు పొరల్లోని భావాల సమాహారమిది.

‘కత్తి’మీద సాము

సర్జరీలోనైనా ఎనస్థిషియాది కీలక పాత్ర. అన్ని దశల్లోనూ ఎనస్థటిస్ట్‌ అప్రమత్తంగా ఉండాల్సిందే. తేడా వస్తే, ప్రమాదమే. అందులోనూ కొవిడ్‌ రోగికి సర్జరీ చేయాల్సి రావడం సంక్లిష్టం. ‘గాంధీ’లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీదేవి మత్తువైద్య నిపుణురాలు. ప్రతి సర్జరీలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. రోగి పక్కనే ఉంటూ ఆక్సిజన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే... దీర్ఘకాలిక రోగుల స్థితికి అనుగుణంగా మత్తుమందు ఇవ్వడం మరో ఎత్తు. ఆమె ఒక ప్రణాళికతో అప్రమత్తంగా వ్యవహరించి విధినిర్వహణలో కృతకృత్యులయ్యారు. ఈ క్రమంలో ఆమె కూడా కరోనా బారిన పడి, విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. ఇంట్లో ఒక ప్రత్యేక గదిలో ఉండేవారు. తనకు కరోనా తగ్గినా, పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోలేని దైన్యం. ఇన్ని ఇబ్బందులున్నా, ధైర్యంగా ముందుకు అడుగు వేశారు. దాదాపు 600కి పైగా సిజేరియన్లు, 300కి పైగా సాధారణ, అతి క్లిష్టమైన సర్జరీల్లో ఆమె కీలక పాత్ర పోషించి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ‘కరోనా తర్వాత నాలో కూడా మార్పులొచ్చాయి. మతిమరుపు ఎక్కువైంది. బాగా దగ్గరి వాళ్లు, తెలిసినవారి పేర్లు కూడా మరిచిపోయేదాన్ని. ఇంటికెళ్లాక అదో రకమైన టెన్షన్‌. మా వాళ్లకు కొవిడ్‌ వస్తుందేమోనన్న ఆందోళన వేధించేది’ అని చెప్పొకొచ్చారు ఆమె.

‘ఒక టీవీ ఆర్టిస్టు(65) కొవిడ్‌ సోకి, ఐసీయూలో చేరారు. మందుల ప్రభావం వల్ల ఆమెకు నోట్లో పుండ్లు పడి, తినడానికి కష్టంగా ఉండేది. ఆ సమయంలో నన్ను దగ్గరకు పిలిచి చెప్పింది..‘‘నాకు కొడుకులు, కూతుళ్లు ఉన్నారు. కోట్ల ఆస్తి ఉంది. వారికి నా ఆస్తంతా రాసిచ్చా. కానీ ఈ సమయంలో నా దగ్గరకు ఎవరూ రావడంలేదు. ఎవరన్నా ఒక ఆయమ్మను నా దగ్గరకు పంపిస్తావా? ఇడ్లీ తినలేకపోతున్నా.. కొంచెం మెత్తగా చేసి పెట్టడానికి. ఆమెకు నేను వెళ్లేటప్పుడు డబ్బులిస్తా’’ అని ప్రాధేయపడింది. నాకు కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. కరోనా సమయంలో ఇలాంటి ఎన్నో దయనీయ ఉదంతాలు చూశానన్నారు శ్రీదేవి.

క వ్యక్తి (50)కి విద్యుత్‌ షాక్‌ కారణంగా రెండు కాళ్లు, రెండు చేతులు పూర్తిగా కాలిపోయాయి. పైగా కొవిడ్‌ సోకడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బు కూడా ఉన్న ఆ వ్యక్తికి మత్తుమందు ఇవ్వడం సంక్లిష్టమే. లోకల్‌ ఎనస్థిషియా ఇచ్చి సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు.

ఆసుపత్రికే అంకితం

రోనా తొలి రోజుల్లో ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకినా, కుటుంబసభ్యులందరినీ ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులకు తరలించేవారు. ఇలా అమీర్‌పేటలోని నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రి ఒక పెద్ద ఇంటిలా మారింది. రోగులు కుటుంబాలతో కొన్ని రోజుల పాటు అక్కడే ఉండేవారు. వారికి ఆహారం నుంచి చికిత్సల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భవానీ శ్రద్ధ వహించేవారు. తన సిబ్బందితో రేయింబవళ్లు సేవలు అందించారు. కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు ఆమె సెలవు కూడా తీసుకోలేదు. ఉదయం ఆసుపత్రికి వెళితే ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవారు. ఉద్యోగాల నిమిత్తం భర్త, కుమారుడు నాగ్‌పుర్‌లో ఉండిపోగా, ఆమె ఒక్కరే ఇక్కడ ఉంటూ కరోనాపై యుద్ధం చేశారు. ఆమె నివసించే అపార్ట్‌మెంటులోనూ పలు కుటుంబాలకు కరోనా సోకితే, అక్కడా వారికి సూచనలు, సలహాలు అందించారు. పసిబిడ్డ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు తమ ఆసుపత్రిలో చికిత్స పొందారని భవానీ తెలిపారు. కొవిడ్‌ సమయంలో పలు సంఘటనలు తనను కలచివేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘కరోనాతో ఒక కుటుంబంలో పెద్ద కొడుకు చనిపోయాడు. అతడి తల్లితండ్రులు, భార్య, కుమారుడికీ పాజిటివ్‌ వచ్చింది. వాళ్లుండే అపార్ట్‌మెంట్‌ వెంటనే ఖాళీ చేయాలని ఒత్తిడి. నాకు రాత్రి పది గంటలకు ఫోన్‌ చేసి వారు ఈ విషయం చెప్పారు. అంబులెన్సు పంపి వాళ్లందర్నీ తీసుకొచ్చాం. మనోధైర్యం చెప్పి ఐసొలేషన్‌ గదిలో ఉంచి చికిత్స చేశాం. 15 రోజుల తర్వాత నెగెటివ్‌ వచ్చాక, అందరినీ ఇంటికి పంపాం. వారికి మా సిబ్బంది మానసికంగా వెన్నుదన్నుగా నిలిచారు’ అని డాక్టర్‌ భవానీ వివరించారు. ఇలాంటి ఉదంతాలెన్నో తాను చూశానన్నారు.

తల్లీబిడ్డలకు అండగా..

ర్భిణులకు కరోనా సోకితే మొదట్లో గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స చేసేవారు. కొందరికి నెలలు నిండి, ప్రసవం చేయాల్సి వచ్చేది. ఇది కత్తి మీద సామే. పుట్టే బిడ్డకు వైరస్‌ సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవడంలో వైద్యులు, సిబ్బంది, ఆయాలు అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రసవం తర్వాత బిడ్డను వేరు చేసి శుభ్రం చేసి శిశువుల వార్డులో సంరక్షణ వరకూ ఆయాలే అన్నీ తామై చూసుకోవాలి. 18 ఏళ్లుగా గాంధీ ఆసుపత్రి ప్రసూతి వార్డులో పనిచేసే భాను ఇలాగే ఎంతోమంది కరోనా సోకిన గర్భిణులకు సేవలు అందించారు. ఆమె ఉదయం 9 గంటలకు వస్తే... ఇంటికి వెళ్లేది మళ్లీ రాత్రికే. ఆసుపత్రి ఉద్యోగం రీత్యా చుట్టుపక్కల వారు దూరం పెట్టేవారు. ఈ స్థితిలో ఆమెకు కుటుంబ సభ్యులు చేదోడువాదోడుగా నిలిచారు. ‘గాంధీలో జరిగిన ప్రసవాల్లో దాదాపు సగానికి పైగా వాటిల్లో నేనూ ఉన్నా. పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు తదితర జాగ్రత్తలతో పనిచేశాం. కొవిడ్‌ గురించి మేమైతే భయపడలేదు. తల్లులకు నేనే ధైర్యం చెప్పేదాన్ని. బిడ్డల క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు వారికి తెలిపేవాళ్లం. తల్లి నడవలేని స్థితిలో ఉంటే, పడకపైనే దుస్తులు మార్చడం సహా అన్నిరకాలుగా సహకరించాం. ఆమె చెయ్యి భుజాన వేయించుకొని, బాత్రూమ్‌కు తీసుకెళ్లేవాళ్లం. ఇదంతా మేం ఎప్పుడూ చేసేదే. కొవిడ్‌ రోగులకు చేశాం కనుక ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు’ అంటూ భాను తన విధి నిర్వహణ తీరును గొప్ప అని భావించకుండా వినమ్రంగా తెలిపారు.

మానవతకు చేయూత

పీపీఈ కిట్ ధరించి ఓ అరగంట ఉంటేనే చెమటలు పట్టేస్తాయి. అలాంటిది గంటల తరబడి కిట్ ధరించి ప్రయాణించడమంటే చాలా కష్టం. హన్మకొండలోని 108 వాహనంలో పనిచేసే మమత కరోనా సమయంలో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి సుమారు 100 మంది కరోనా రోగులను తీసుకొచ్చారు. స్థానికంగా నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. ఆమెకు ఎదురైన అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘గత 13 ఏళ్లుగా 108 వాహనంలో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నా. కొవిడ్‌ సమయంలో మేం పడ్డ అవస్థలకన్నా దెబ్బతిన్న మానవ సంబంధాలను చూసి కన్నీళ్లు వచ్చేవి. హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలికి పాజిటివ్‌ అని తేలింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించడానికి మేం వెళ్లాం. ఆమె చేతికి నాలుగు బంగారు గాజులున్నాయి. కొడుకులు, కుమార్తెలు దగ్గరకు కూడా రాలేదు. కానీ, బంగారు గాజులు ఇవ్వమని కబురు పంపారు. నాలుగు గాజులూ ఇచ్చేస్తే, పిల్లలు తనను ఆసుపత్రిలోనే వదిలేస్తారేమో అని ఆ తల్లి భయపడి రెండే ఇచ్చారు. ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాక కొడుకు కనీసం స్ట్రెచర్‌ సాయం పట్టడానికి కూడా దగ్గరకు రాకపోవడం చూసి ఎంతో బాధేసింది. తల్లి గాజులు పనికొచ్చాయి కానీ, కన్నపేగు మీద కనికరం లేకుండా పోయింది. మరో వ్యక్తి ఫోన్‌ చేసి మట్టెవాడలో తన తల్లి మరణించిందని, తాను ఊళ్లో లేనని చెప్పాడు. అక్కడికెళ్లి చూస్తే, ఆమె బతికే ఉంది. మళ్లీ అతనికి ఫోన్‌ చేసి చెబితే తాను ఊరి నుంచి మర్నాడు వస్తానని చెప్పాడు. ఇలాంటి దయనీయ ఉదంతాలెన్నో. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి మూడు గంటలు పట్టేది. అంతసేపూ అంబులెన్సులో కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉండేవాళ్లం. లాక్‌డౌన్‌ సమయంలో గుక్కెడు నీళ్లు దొరకడం కూడా గగనమైంది’ అంటూ వివరించారు మమత.

బయో వ్యర్థాల నడుమ... భయం లేకుండా..

నిషిని మనిషి చూసి భయపడిన రోజులవి. అలాంటి సమయంలో కరోనా రోగుల వార్డులను, మరుగుదొడ్లను శుభ్రం చేయడం ఎంతో ప్రమాదకరం. ఈ విభాగంలో ఎక్కువ మంది మహిళాలే ధైర్యంగా ప్రాణాలొడ్డి సేవలందించారు. ‘కరోనా వార్డులో ఎక్కువ మంది వృద్ధులే ఉండేవారు. వారిని మరుగుదొడ్లకు తీసుకెళ్లడం, డైపర్లు మార్చడం వంటివి చేసేవాళ్లం. అలాగే కరోనా రోగులు, వైద్యులు, సిబ్బంది వాడిన పీపీఈ కిట్లు, ఐసీయూల్లోని ఇతర వ్యర్థాలను డబ్బాల్లోకి సేకరించి, డంపింగ్‌ యార్డుకు తరలించేవాళ్లం. ఎంత సేవ చేసినా రోగులు చనిపోయినప్పుడు చాలా బాధనిపించేది. మృతదేహాలను మేమే కవర్లతో ప్యాక్‌ చేసేవాళ్లం. మా ఇళ్ల దగ్గర ఇరుగుపొరుగు మమ్మల్ని రానిచ్చేవారు కాదు. లాక్‌డౌన్‌లో ఆటోలు లేక ఎండలో నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇంటికెళ్లాక పిల్లల్ని దగ్గరికి రాకుండా చూడటం ఎంతో కష్టమయ్యేది’ అని తెలిపారు నిజామాబాద్‌ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న శైలజ, బబ్లి.

రక్షణలో రాణించి...

కొవిడ్‌ రోజుల్లో పోలీసుల విధులూ ఎంతో సంక్లిష్టంగా సాగాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల అమలు, కరోనా రోగుల చిరునామాల కోసం వెతుకులాట, వైరస్‌ వ్యాప్తి పెరగకుండా కంటెయిన్‌మెంట్‌ జోన్ల నిర్వహణ, నిస్సహాయులకు తోడ్పాటు, వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపడం వంటి విధులన్నీ సమాంతరంగా నిర్వహించాల్సి వచ్చింది. కానిస్టేబుల్‌ నుంచి కమిషనర్‌ వరకూ అందరికీ ఊపిరిసలపనంత పని. వైరస్‌ సోకిన వారి ఇళ్ల వద్ద ఇరుగుపొరుగు అభ్యంతరాలతో చిన్నపాటి ఘర్షణలు, అద్దె ఇళ్లలో యజమానులతో తగవులు... పోలీసులే పరిష్కరించాల్సిన స్థితి. హైదరాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్‌ షిఖా గోయెల్‌ ఆ రోజుల్లో సమన్వయంతో విధులు నిర్వర్తించారు. ‘గత ఏడాది ఏప్రిల్‌ 1న రాత్రివేళ... తమ వారిని సరిగ్గా చూడడం లేదంటూ... గాంధీ వైద్యులపై రోగుల బంధువులు దాడి చేశారు. దీంతో డాక్టర్లు విధులను బహిష్కరించారు. మేం వెంటనే వెళ్లి ఇరువర్గాలతో చర్చించి సర్దుబాటు చేసేసరికి, తెల్లవారుజాము మూడు గంటలైంది. కరోనా వార్డుల్లో సాయుధ బలగాలను రక్షణగా నియమిస్తామని భరోసా ఇచ్చి, వెంటనే అమలు చేశాం. మేం కూడా కొన్ని రోజులపాటు రాత్రివేళల్లో ఆసుపత్రికి వెళ్లాం. వలస కూలీలను శ్రామిక్‌ రైళ్లలో తరలించేందుకు పలు వ్యూహాలు అమలు చేశాం. పది రోజుల్లో 3 లక్షల మందిని స్వస్థలాలకు పంపించాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నాకూ వైరస్‌ సోకింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నా. వైరస్‌ తగ్గేసరికి నా మానసిక పరిస్థితి, ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలనన్న ఆత్మవిశ్వాసం కలిగింది. కోలుకున్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరాను. ఆ తర్వాత మా సహచరులకు కరోనా సోకితే నేనే ధైర్యం చెప్పేదాన్ని. కొవిడ్‌ మర్చిపోలేని అనుభవాలను నేర్పింది’ అని వివరించారు షిఖా గోయెల్‌.

అన్నార్తులకు అమృతహస్తం

పిల్లల ఆకలి అమ్మకే తెలుస్తుంది. కరోనా వేళ వందల కిలోమీటర్లు కాలి నడకన తరలిపోతున్న వలస కార్మికుల ఆకలి... ఆమెలోని తల్లిపేగును కదిలించింది. అప్పటికే ‘అమృతహస్తం’ సేవా సంస్థను ఏర్పాటు చేసి, పేదలు, అనాథలకు అన్నం పెడుతున్న ఆమె... బృహత్‌ యజ్ఞాన్ని భుజానికెత్తుకున్నారు. ఒకరా ఇద్దరా... రోజుకి 15 వేల మంది చొప్పున, తొమ్మిది నెలల్లో 12 లక్షల మంది కడుపునింపారు విజయవాడకు చెందిన దారా కరుణశ్రీ.
‘‘2018లో మేం ‘అమృతహస్తం’ ప్రారంభించాం. పెళ్లిళ్లు, విందుల సమయంలో వృథా అయ్యే ఆహారాన్ని ‘డోంట్‌ త్రో... డొనేట్‌’ అనే నినాదంతో సేకరించేవాళ్లం. ఇలా నిరుడు మార్చి వరకు రెండేళ్లలో 20 లక్షల మందికి ఆహారం అందజేశాం. కరోనా సమయంలో ఫంక్షన్లు లేకపోవడంతో బయటి నుంచి ఆహార పదార్థాలు వచ్చేవి కాదు. మేమే సొంత ఖర్చులతో వెయ్యి మందికి ఆహారం అందజేయాలని అనుకున్నాం. మా సేవల్ని గుర్తించి ఐఆర్‌సీటీసీ రోజూ 5000 మందికి మా ద్వారా ఆహారం అందజేసేందుకు ముందుకొచ్చింది. ఇతర సంస్థలూ జత కలవడంతో నిత్యం 15 వేల మందికి ఆహారం అందజేశాం. మా వాళ్లు ఫలానాచోట చిక్కుకుపోయారు. భోజనం అందించండని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చేవి. వెంటనే అక్కడకు వెళ్లి ఆహారం ఇచ్చేవాళ్లం. బస్తీల్లో ఉన్న పేదలు, హాస్టళ్లలో ఉండిపోయిన విద్యార్థులు, కార్మికులు... ఇలా విభిన్న వర్గాల వారిని చేరుకున్నాం. మా సేవల్ని చూసి... ఐఏఎస్‌ అధికారి పీయూష్‌ కుమార్‌ ఐటీసీ వాళ్లతో మాట్లాడి రూ.8.5 లక్షల విలువైన 30 వేల జ్యూస్‌ ప్యాకెట్‌లు ఇప్పించారు. 100 కి.మీ. దూరంలో ఒకచోట తోటలో అరటి గెలలు ఉండిపోయాయి, ఉచితంగా ఇస్తామంటే వెళ్లి తీసుకొచ్చి కరోనా రోగులకు ఇచ్చాం. లేస్‌ కంపెనీ 450 పెద్ద బాక్సుల్లో చిప్స్‌ ఇస్తే... రైళ్లలో వెళ్లేవారికి, వలస కార్మికులకు సరఫరా చేశాం. రైల్వే, మున్సిపల్‌ కార్మికులకు నిత్యావసరాలు, దుస్తులను ఇచ్చాం’’ అని కరుణశ్రీ తెలిపారు.

ఇదీ చదవండి: అది జరిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం..!

ABOUT THE AUTHOR

...view details