అమరావతిలో ముగ్గులు.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్న మహిళలు - అమరావతిలో మహిళల వినూత్న నిరసన
రాజధాని అమరావతి మహిళలు.. వినూత్న నిరసన తెలిపారు. కొత్త సంవత్సరం వేళ.. వేడుకలకు దూరంగా ఉన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ముగ్గులు వేసి.. తమ పోరాటాన్ని కొనసాగించారు.

అమరావతి కోసం.. అలుపెరగకుండా రైతులు చేస్తున్న పోరాటంలో.. మహిళలు సైతం నిత్యం భాగస్వాములు అవుతున్నారు. 14 రోజులుగా ధర్నాలు, ఆందోళనలు, వంటావార్పు, సామూహిక పారాయణాలు, గోవింద నామ భజనలు చేసిన మహిళలు.. ఇవాళ కొత్త సంవత్సరం రోజు కూడా.. తమ ఆకాంక్షలను వినూత్నంగా వ్యక్తం చేశారు. వేడుకలకు దూరంగా ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ముగ్గులు వేసి సందడి చేసే వేళ.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. మన అమరావతి.. మన రాజధాని.. అంటూ తుళ్లూరులో ముగ్గులు వేశారు. తాము పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని మహిళలు గుర్తు చేశారు. రాజధాని లేని సమయంలో.. రాష్ట్రం కోసం తాము చేసిన ఈ త్యాగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ఆవేదన చెందారు. విశాఖ, కర్నూలును సైతం అభివృద్థి చేయాల్సిందే అని.. కానీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ త్యాగాన్ని, పోరాటాన్ని గుర్తించాలని కోరారు. మరిన్ని వివరాలు తుళ్లూరు నుంచి మా ప్రతినిధి అందిస్తారు.