తెలంగాణలోని హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునగనూరులో రజిత హత్యకేసును పోలీసులు ఛేదించారు. పధకం ప్రకారమే ఈనెల 19న ఆమెను హత్య చేశారని.. నిందితులు కీర్తి, శశికుమార్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. మృతురాలి వడ్డీ వ్యాపారంపై కన్నేసిన శశికుమార్... కీర్తిని బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకున్నాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
కన్నపేగు రాసిన మరణశాసనమిది... రజిత హత్యకేసులో కీర్తి, శశి అరెస్ట్ - hyderabad latest news
హైదరాబాద్ హయత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన రజిత హత్య కేసులో నిందితులు కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రజితను కీర్తితో కలిసి శశికుమార్ హత్య చేశారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.
"కీర్తి ఇంటి సమీపంలో ఉండే బాల్‌రెడ్డి(23).. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భవతి అయిన కీర్తిని శశికుమార్ లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు కీర్తి తల్లి రజిత అడ్డు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్ కలిసి పధకం ప్రకారం తల్లి రజితను గొంతు నులిమి చంపేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి రామన్నపేట వద్ద రైలు పట్టాలపై పడేశారు. గతంలో కూడా తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు కీర్తి ప్రయత్నించింది. కీర్తిపై అత్యాచారానికి పాల్పడిన బాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో చాలా ఆధారాలున్నాయని సీపీ తెలిపారు. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు కీర్తి, శశికుమార్ చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు. హత్య చేశాక కీర్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తల్లి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసిందని, ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు. కీర్తి, శశికుమార్ కలిసి రజితను హత్యచేయడం.. తల్లి కనిపించట్లేదని ఫిర్యాదు చేయడంలాంటి ఉదంతాలన్నీ 'దృశ్యం' సినిమా రెండో పార్ట్‌లా ఉన్నాయని మహేశ్ భగవత్ గుర్తు చేశారు.