ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇదీ సంగతి: చెన్నైలో రోజు వారీ కూలీ..తొలి స్థానంతో నెల్లూరులో సర్పంచి - ap panchayat elections 2021

ప్రజాప్రతినిధి.. అవ్వాలంటే నానా తిప్పలు పడాల్సిందే..! నిత్యం ప్రజల్లో ఉంటేనే పది ఓట్లు పడేది! ప్రజామోదం ఉంటేనే దశ మారేది. కానీ కొన్నిసార్లు తీరా గెలుపు గీత వరకు వచ్చినా.. దురదృష్టం వెంటాడుతోంది. కొద్దిలోనే కూర్చీ చేజారిపోతుంది. అదే సమయంలో.. వద్దనుకున్నా మన చెంతకు వెతుక్కుంటూ వస్తుంది. ఎన్నికల్లో ఇలాంటి అనూహ్య ఘటనలు ఎన్నో చూస్తూనే ఉంటాం. అలాంటి కోవలోకే వచ్చే ఓ కూలీ కథ చూస్తే... అదృష్టమంటే ఇదీ అనాల్సిందే...! మరీ ఆ కథెంటో మీరూ చదివేయండి...!

ap panchayat elections 2021
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021

By

Published : Feb 8, 2021, 10:07 AM IST

Updated : Feb 8, 2021, 12:12 PM IST

వి. అంకయ్య.. చెన్నైలో రోజు వారీ కూలీ. ఓ గ్రామానికి సర్పంచ్ అయిపోయాడు. అదీ నామినేషన్ వేయకుండానే.! ఏకగ్రీవమంటే అదీ కాదు..కానీ కూర్చీ ఎక్కేశాడు. ఇదంతా జరిగింది కేవలం..అతని పేరు మొదటి స్థానంలో ఉండటమే..! 1985లో జరిగిన ఈ పరిణామం... నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ విశేషమే.

ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు...

1985లో అప్పటి వరకు నీలాయపాలెం పొదలకూరు సమితి పరిధిలో చిరమన పంచాయతీ అనుబంధంగా ఉండేది. మండల వ్యవస్థ ఏర్పడటంతో సంగం మండలానికి మారింది. అప్పుడు ఈ గ్రామస్థులు తమకు ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేయాలని నాటి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయన ఆమోదంతో ప్రత్యేక పంచాయతీ ఏర్పడింది.

తొలి పేరు ఎవరిదో వారే....

ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. నాడు 350 మంది ఓటర్లున్న ఆ పంచాయతీలో సర్పంచి పదవికి ఎవరూ పోటీ పడకుండా.. అప్పటి అధికారులు ఒక ప్రతిపాదన చేశారు. ఓటర్ల జాబితాలో తొలి పేరు ఎవరిదో.. వారినే తొలి పౌరుడిగా ఎంపిక చేస్తామన్నారు. గ్రామస్థుల అంగీకారంతో దాన్ని అమలు చేయగా... ఆ జాబితాలో తొలిపేరుగా ఉన్న వి.అంకయ్య సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఆ సమయానికి అంకయ్య చెన్నైలో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. తాను సర్పంచిగా ఎంపికయ్యానని తెలుసుకుని సంతోషించి.. గ్రామానికి వచ్చి సేవలందించారు. 1987 వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఈ విషయాన్ని ఇప్పటికీ గ్రామంలో విశేషంగా చెప్పుకొంటారు.

ఇదీ చదవండి:పల్లె పోరు: బరిలో అక్కాచెల్లెలు..నేనున్నానంటూ బంధువు

Last Updated : Feb 8, 2021, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details