జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్ కాంపొనెంట్ కింద రాష్ట్రంలో గత మూడేళ్లలో చేపట్టిన పనులకు ఇంకా రూ.2,512.77 కోట్ల బకాయిలు చెల్లించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో కొన్నిచోట్ల నిర్మాణ పనులు నెమ్మదిస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన పలు పనుల బిల్లుల బకాయిలు తక్షణం చెల్లించాలని, వీటిపై 12 శాతాన్ని వడ్డీ నాలుగు వారాల్లో జమ చేయాలని 1,012 వ్యాజ్యాల్లో హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దీంతో ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నరేగా వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం మెటీరియల్ కాంపొనెంట్ కింద 2019-20, 2020-21, 2021-22లో ఇప్పటి వరకు రూ.7,398.65 కోట్ల విలువైన పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటి వరకు రూ.4,476 కోట్లు చెల్లించారు. పంచాయతీరాజ్ కమిషనర్ స్థాయిలో, ఇతర సాంకేతిక కారణాలతో కొన్ని బిల్లులు నిలిపివేయగా.. ఇంకా రూ.2,512 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. గత ఆరు నెలలుగా మెటీరియల్ పనులకు చెల్లింపులు నిలిపివేశారని మెటీరియల్ సరఫరాదారులు చెబుతున్నారు. దీంతో అనేక జిల్లాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ వంటి భవన నిర్మాణ పనులు నెమ్మదించాయి. ఇందులో రైతు భరోసా కేంద్రాలు ఆగస్టు నెలాఖరుకే పూర్తవ్వాల్సి ఉన్నా చాలాచోట్ల కాలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో తూర్పుగోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.