ఓ వృద్ధురాలు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించింది. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు వారు వచ్చేవరకు చోరీ జరిగిన ప్రాంతంలోకి వెళ్లలేదు. దీంతో దొంగకు సంబంధించి ఆనవాళ్లు నిందితుడిని పట్టించేలా చేశాయి. ఈ ఘటన తెలంగాణ హైద్రాబాద్లో జరిగింది.
గత నెల వినాయక చవితి సమయంలో నగరంలోని కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌లో ఓ వృద్ధురాలు (59) ఇంటికి తాళం వేసి నిజాంపేటలోని తన కుమార్తె ఇంటికి వెళ్లింది. మూడు రోజుల తర్వాత వచ్చి, చూసేసరికి ఇంట్లోని బీరువా తెరిచి ఉంది. బంగారు నగలు దొంగులు ఎత్తుకెళ్లారని గ్రహించింది. అవాక్కైన పెద్దావిడ కంగారు పడకుండా..కాస్త సమయస్ఫూర్తిని కనబరిచింది.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటుగా ఆ గదిలోని వస్తువులేవీ ముట్టుకోలేదు. ఆవిడ చేసిన ఆ పనే క్లూస్ టీంకు కలిసొచ్చింది. ఘటనాస్థలంలో వేలిముద్రలు సేకరించిన పోలీసులు...పాత నేరస్థుల వేలిముద్రలతో పోల్చి చూసి అసలు దొంగను ఇట్టే పట్టేశారు.
దొంగ ఎవరంటే...
వృద్ధురాలి ఇంట్లో సేకరించిన వేలిముద్రలను పోలీసులు పాత నేరస్థుల వేలముద్రలతో పోల్చి చూశారు. అవి ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ (23)కు చెందినవిగా తేల్చారు. అతని కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా దుర్గా ప్రసాద్ కృష్ణా జిల్లా కంచికచర్లలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు కంచికచర్ల వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 2018లో బంజారాహిల్స్ పరిధిలో ద్విచక్ర వాహన దొంగతనం కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. పాత కేసుల్లో నిందితుడు కావడంతో ఇతనిపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించగా 2019 సెప్టెంబర్‌లో విడుదలయ్యాడు. అయినా బుద్ధి మార్చుకోని దుర్గాప్రసాద్.. కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్, మాదాపూర్, సూర్యాపేట ఠాణాల పరిధిలో దొంగతనాలు చేయసాగాడు. రెండో తరగతి వరకే చదివిన ఇతను ఫోన్ వాడడు. సీసీ కెమేరాలున్నచోట జాగ్రత్త పడతాడు. చోరీలు వేగంగా చేస్తాడు. నిందితుడి నుంచి 5 తులాల బంగారు, 5 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని సోమవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి : blade batch attack: విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్