గూడులేక అల్లాడిపోయిన అక్కాతమ్ముడు శ్రీలత, ప్రశాంత్ కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. అమ్మానాన్నలను కోల్పోయి రేకుల షెడ్డులో దయనీయ పరిస్థితిలో ఉన్న వారి పరిస్థితిని ఈనాడు-ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చింది. ఇది చూసి చలించిపోయిన దాతలు ముందుకొచ్చారు. వారి ఇంటి కోసం సాయం చేశారు. అంతా కదిలి వారికి ఓ గూడు కల్పించారు. ఆదివారం నాడు ఆ అక్కాతమ్ముడు కొత్తింట్లో అడుగుపెట్టారు.
రేకుల షెడ్డులో...
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీలత, ప్రశాంత్‌లు అమ్మానాన్నను కోల్పోయారు. ఐదేళ్ల క్రితం తండ్రి, రెండేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్నుమూసింది. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడంతో వీరి జీవితం ఒక్కసారిగా అంధకారమయమైంది. రేకుల షెడ్డులో నివసిస్తూ కాలం వెల్లదీశారు.
మూడు ముళ్లకు దూరం
శ్రీలతకు పెళ్లి చేయాలని బంధువులు ప్రయత్నించారు. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తమ్ముడు ఇబ్బందులు పాలవుతాడని ఆందోళన చెందారు శ్రీలత. వారు నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. కుట్టు మిషన్ పని చేస్తూ శ్రీలత తమ్ముడిని చదివిస్తున్న విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చింది. 'తమ్ముడు ఆగమవుతాడని మూడు ముళ్లకూ దూరం' శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.
కొత్తింట్లోకి..
వీరి దుస్థితిని చూసి చలించిపోయి చాలామంది దాతలు ముందుకొచ్చారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక దాత తొలుత రూ.50 వేలు వారికి అందించారు. అలా ఒక్కొక్కరుగా సుమారు 40 మంది వరకు స్పందించారు. రూ.500 ఇచ్చిన వారూ ఉన్నారు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఒకరు రంగులు వేయిస్తే.. మరొకరు ఇసుక ఇప్పించారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేయగా నిర్మాణం పూర్తవడంతో తమ్ముడు ప్రశాంత్, అక్క శ్రీలత కలిసి దాతల సమక్షంలో ఆదివారం తమ కొత్తింట్లోకి అడుగుపెట్టారు. ఒక హాలు, వంటగది, బెడ్రూం ఉన్న ఈ ఇంటిని చూసి వారు మురిసిపోతున్నారు.
ఇల్లు లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. రేకుల షెడ్డులో కాలం వెల్లదీశాం. ఆ చిన్న షెడ్డులోకి ఒక్కోసారి పాములు వచ్చేవి. మా సమస్యలు వార్తల్లో వచ్చాయి. వాటిపై చాలామంది స్పందించారు. నలభై మంది వరకు మాకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. అంతా కలిసి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేశారు. చివరకు మా ఇల్లు పూర్తయింది. అమ్మానాన్నలను కోల్పోయిన మాకు సమాజంలోని ఇంతమంది మద్దతు దొరకడం అదృష్టం. దాతలందరికీ మేం రుణపడి ఉంటాం.