WINGS INDIA AVIATION: తెలంగాణలోని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2022 ఏవియేషన్ షో సందర్శకులను అలరిస్తోంది. గతేడాది బోయింగ్ విమానాల హంగులను చూసిన నగరవాసులను.... ఈసారి ఎయిర్‌బస్ సొగసులు, ఎంబ్రరర్ రాజసం, ఫైటర్ జెట్ విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. ఆర్మీ హెలికాఫ్టర్లు, చార్టెడ్ ఫ్లైయిట్లు, కమర్షియల్ విమానాలు ఇలా పది వరకు విమానాలు రన్‌వేపై సందర్శకుల కోసం నిలిపి ఉంచారు. విమానాల లోపలి ఫీచర్లు, పనితీరు, బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై ఎగ్జిబిటర్లు... సందర్శకులకు వివరిస్తున్నారు.
మొదటి రోజు బీ2బీ మీటింగ్స్‌లో భాగంగా ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత పౌరవిమానయాన శాఖతో.... తమ భాగస్వామ్యం, భవిష్యత్తు ఏవియేషన్ ప్రణాళికలు పంచుకున్నాయి. విమానాల ప్రదర్శనతోపాటు... ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రకటలను వెలువరించాయి. భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని రాబోయే ఇరవై ఏళ్లలో 2 వేల 210 విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్‌బస్ ప్రకటించింది. ప్రముఖ విమాన ఇంజన్ల తయారీ కంపెనీ.... ప్రాట్ అండ్ విట్నీ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా బెంగళూరులో తమ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. క్రమంగా భారత్‌లోని ఇతర నగరాలకు ఈ ఫెసిలిటీని విస్తరిస్తామని పేర్కొంది.