బొలీవియా... సౌత్ అమెరికాలోని దేశం ఇది. ఈ కంట్రీలోని లాపాజ్ నగరంలో ఓ ఇల్లు.. ఆ ఇంట్లో ఓ ఘోరమైన పగలు.. నిద్రలో కూడా "పగటి కలలు" కనడం నేరమని ఆ భర్తకు తెలిసి ఉండదు. "తెలిసినా ఏం చేస్తాడు.. నిద్రలో వచ్చే కల అతనికెలా తెలుస్తుంది పాపం.." అంటారా? ఇదే ప్రశ్న అతని భార్యను అడిగితే.. "ఎందుకు తెలియదు? మెలకువగా ఉన్నప్పుడు గాఢంగా దేన్నైతే కోరుకుంటారో.. అదే కలలో వస్తుంది. నాకు తెలియదా ఏంటీ? హమ్మా.." అంటుంది. ఇంతకీ ఆ విషాద పగటిపూట ఏం జరిగిందో తెలుసుకుందాం..
భర్త బెడ్ మీద నిద్రిస్తున్నాడు.. అతని వయసు 45 ఏళ్లు.. గాఢ నిద్రలో ఉన్న అతను మెల్లగా శబ్దం చేయడం మొదలు పెట్టాడు. భార్య దగ్గరికి వచ్చి చూసింది.. "ఏదో కలవరిస్తున్నాడు". చెవులు రెక్కించి మరింత దగ్గరగా వెళ్లి విన్నది. అంతే.. ఒళ్లు మండింది.. పళ్లు కొరికింది.. కళ్లు పెద్దవి చేసింది.. పట్టలేనంత ఆవేశంతో.. ఆగ్రహంతో.. ఉద్రేకంతో.. వంటింట్లోకి పరిగెత్తింది. తనలోని ఫైర్ ను కూడా యాడ్ చేసి.. సెగలు కక్కేంతగా గిన్నెడు నీళ్లు మరిగించింది. ఉడికిపోతున్న ఆ నీటిని పట్టుకొచ్చి.. ఒక్క ఉదుటన నిద్రిస్తున్న భర్త జననాంగంపై కుమ్మరించింది.
అతగాడు పెట్టిన కేకలు అపార్ట్ మెంట్ దాటి.. వీధి చివరి వరకూ వ్యాపించాయి. క్షణాల్లో బజారు మొత్తం వాళ్లింట్లో వాలింది.. భర్త తీవ్ర గాయాలతో అల్లాడిపోతున్నాడు. ఆసుపత్రిలో బర్నాల్ రాసిన డాక్టర్.. బర్నింగ్.. "సెకండ్ స్టేజ్" కూడా దాటిందని చెప్పారు. అంటే.. నీళ్లు ఎంతగా వేడెక్కాయో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితురాలైన భార్యను, బాధితుడైన భర్తను విచారించారు. కేసు ఫైల్ చేసి.. భార్యను జీప్ ఎక్కించారు.