హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నిర్మాణ పనులు ఎప్పుడో ఏళ్ల కిందటే ప్రారంభమైనా ఇప్పటికీ తొలి దశ ప్రయోజనమూ నెరవేరలేదు. ఆశించిన మేర కాలువల్లో ప్రవాహ సామర్థ్యం లేకపోవడంతో.. రెండేళ్ల కిందట కాలువల వెడల్పు పనులు చేపట్టినా అనుకున్నది జరగలేదు. ఇప్పుడు ఈ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు వీలుగా వెడల్పు పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శ్రీశైలంలోని వరద జలాలను మల్యాల పంపింగ్ స్కీం నుంచి 13 దశల్లో ఎత్తిపోస్తూ వివిధ జలాశయాల్లో నింపుతూ ఆయకట్టుకు అందించేందుకు పథకాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 565 కిలోమీటర్ల మేర కాలువ ప్రవహిస్తూ కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 6,02,500 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది లక్ష్యం.
3,880 క్యూసెక్కుల లక్ష్యం
హంద్రీనీవా ప్రధాన కాలువలో రోజుకు 3,880 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం మేరకు కాలువలను నిర్మించారు. నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా పంపడం ప్రారంభించిన తర్వాత ఆ లక్ష్యం చేరలేదన్న విషయం జలవనరుల శాఖ గుర్తించింది. కాలువ లైనింగు లేకపోవడం వల్లే సమస్య ఏర్పడిందని ఇంజినీరింగు అధికారులు పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రవాహ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా ఏం చేయాలో సూచించాలంటూ గత ప్రభుత్వ హయాంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. లైనింగ్ లేకుండానే కాలువ వెడల్పు పనులు ప్రతిపాదించారు. పైగా కాలువ వరకు వెడల్పు చేస్తూ కట్టడాల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని నాడు నిపుణులు సూచించిన మేరకు రూ.1030 కోట్ల అంచనా వ్యయంతో హంద్రీనీవా తొలిదశలో కాలువ వెడల్పుకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది.