నెదర్లాండ్స్‌లో అదో పొగాకు తోట. 1879 మధ్యలో- అందులోని మొక్కలన్నీ వాడిపోవడం మొదలుపెట్టాయి. అక్కడి రైతులు అడాల్ఫ్ మేయర్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తతో తమ గోడు వెళ్లబోసుకుంటే ఆయన ఆ నేలా, మట్టీ, వేడీ అన్నింటినీ పరిశోధించి చూశాడు. వాటిలో ఏ సమస్యా లేదు. మొక్కలకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండొచ్చని కాండం నుంచి ‘ద్రవాన్ని’ తీసి పరిశీలించాడు. బ్యాక్టీరియా కనిపించాయి. ఆ బ్యాక్టీరియాని ల్యాబ్‌లోనే పెంచి... వాటిని ఆరోగ్యంగా ఉన్న మొక్కలపైన చల్లాడు. వాటికేమీ కాలేదు! ‘ఈబ్యాక్టీరియా కాకుండా మొక్కల్ని నాశనం చేసేది ఇంకేదో ఉందన్నమాట. అదే వీటి వినాశనానికి కారణం!’ అనుకున్నాడు. కానీ అప్పటికే విసిగి వేసారి తన పరిశోధనని వదిలేశాడు. కొన్నేళ్ల తర్వాత మార్టినస్ బీజ్రింక్ అనే శాస్త్రవేత్త ఆ పరిశోధనను కొనసాగించాడు. పొగాకు మొక్కలనుంచి మేయర్ లాగే ద్రవాన్ని తీసుకుని అందులోని బ్యాక్టీరియాని కూడా వడపోసి మిగిలిన ద్రవాన్ని ఆరోగ్యంగా ఉన్న మొక్కలపైన చల్లాడు. అవి చనిపోయాయి. ఆ ద్రవాన్ని మరిగించి అందులో కాస్త ఆల్కహాల్ పోసి మళ్లీ దాన్ని మొక్కలపైన చల్లితే అవీ చనిపోయాయి. అంటే- వేడిచేసినా ఆల్కహాల్ కలిపినా ఏమీకాని ఆ ద్రవం ఓ వింత విషంలాంటిది అనుకున్నాడు. అందుకే దానికి ‘వైరస్’ (లాటిన్‌లో ‘వైర’ అంటే విషం) అని పేరుపెట్టాడు. ఆ పరిశోధన అక్కడితో ఆగిపోవడంతో వైరస్ గురించి ప్రపంచానికి తెలియడానికి మరో 20 ఏళ్లు పట్టింది. ఈలోపు 1918-20లలో ప్రపంచాన్ని ఇన్‌ఫ్లూయెంజా గడగడలాడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఐదుకోట్లమందిని పొట్టనపెట్టుకుంది. ఇంత జరిగినా దానికి బ్యాక్టీరియానే కారణమనుకున్నారు! అప్పుడే- 1920లో వెండల్ స్టాన్లీ అనే శాస్త్రవేత్త మళ్లీ ఆ పాత ‘ద్రవాన్ని’ తీసుకుని ఓ ప్రత్యేకమైన ఫిల్టర్‌ని తయారుచేసి వైరస్ ప్రొటీన్‌ని మాత్రం వడకట్టి ఓ చోటకి చేర్చడం మొదలుపెట్టాడు. ఆ ప్రొటీన్ అలా పొరలుపొరలుగా చేరి సూదుల్లాంటి ఆకారాన్ని సంతరించుకుంది. దానిపైన ఎక్స్‌రేని ప్రసరిస్తే... తొలిసారి వైరస్ దర్శనం ఇచ్చింది! ఇక, 1939లో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌ను కనిపెట్టాక వైరస్‌రూపం ప్రపంచం మొత్తానికీ తెలిసింది. మానవాళి చేసిన గొప్ప ఆవిష్కరణల్లో అదీ ఒకటి.
ఆ తర్వాతే- 1918 నాటి ఇన్‌ఫ్లూయెంజాకి మాత్రమే కాదు, మశూచికీ రేబిస్‌కీ కూడా కారణం వైరస్ అని తెలుసుకున్నారు. బ్యాక్టీరియాలాగే దీన్నీ కట్టడి చేయొచ్చనుకున్నారు కానీ అది లొంగలేదు. దాని రూపంలో, మనుషుల్లోకి చొచ్చుకుపోయే విధానంలో, మందులకి తప్పించుకునే వైనంలో... అన్నింటా సవాలు విసిరింది. ఆ సవాలుకు సమాధానం కనుగొనే క్రమంలో వెల్లడైన అంశాలు శాస్త్రవేత్తలనే విస్మయపరిచాయి.
అన్నిటికీ మూలం..
భూమ్మీద తొలి జీవజాలం పుట్టుక నాలుగువందల కోట్ల సంవత్సరాల ముందు జరిగిందంటారు. ఒకే కణం ఉన్న జీవులూ(ఆర్కియం), అంతకన్నా సంక్లిష్ట నిర్మాణమున్న బ్యాక్టీరియా(బ్యాక్టీరియం), ఈ రెండింటికన్నా కాస్త పెద్దవైన చిన్నజీవులు(యూరోకైట్స్-తర్వాతి కాలంలో చెట్లూ, జంతుజాలాలకి ఇవే మూలాలంటారు)... ఇవి మూడే ఉండేవని నమ్ముతూ వచ్చారు. కానీ తాజా జన్యు పరిశోధనలు ఆ మూడింటికన్నా ముందే వైరస్‌లు పుట్టాయని స్పష్టంచేస్తున్నాయి. భూమ్మీద ఓ ‘ఆదిమ’ ప్రాణం పురుడుపోసుకుని అది పైన చెప్పిన మూడురకాల ప్రాణులుగా పరిణామం చెందడానికి ఆ వైరస్‌లే కారణమని చెబుతున్నారు. అలా భూమి మీద విభిన్న జీవరాశుల ఉనికికి శ్రీకారం చుట్టింది వైరస్‌లేనన్నమాట. నాటినుంచీ నేటి మన మనుగడ వరకూ ప్రతి పరిణామం వెనకా వైరస్ ఉనికి ఉంది.
ప్రాణవాయువు నింపింది..
మీరు సముద్రం ఒడ్డున నిలబడి ఆ నీళ్లలో ఓ మునకేశారనుకుందాం. పొరబాటున మీ నోట్లోకి కొన్ని నీళ్లు పోయాయి. ఆ కాసిని నీళ్లలో ఐదు కోట్ల వైరస్‌లు ఉంటాయని ఓ అంచనా. అమ్మో... అనుకోకండి. ఆ వైరస్‌లలో ఒకట్రెండు కూడా మీకు హాని చేసేవి ఉండవు. ఇక లీటర్ సముద్రం నీటిలోనైతే రెండొందల కోట్ల వరకూ వైరస్‌లు ఉంటాయట. సముద్రంలో అవేం చేస్తుంటాయీ అంటే... అక్కడి బ్యాక్టీరియాని వేటాడుతుంటాయి. వాటివల్లే మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతోంది. ఆ వేటవల్లే భూ వాతావరణం మరీ వేడెక్కకుండా చల్లగా ఉంటోంది. మనం పీల్చే ఆక్సిజన్‌లో మూడోవంతును సముద్రంలోని ‘సయానో’ బ్యాక్టీరియా తయారుచేస్తాయి. మొక్కల్లాగే సూర్యరశ్మిని శక్తిగా మార్చుకునే ఈ బ్యాక్టీరియా ఆ ప్రక్రియలో భాగంగా ఆక్సిజన్‌ని విడుదలచేస్తాయి. వైరస్‌ల ప్రేరణతోనే ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేస్తుంటాయి. అంటే- వైరస్‌లు వాటిని సోకినప్పుడు పీఎస్‌బీఏ అనే జన్యువుని విడుదలచేసి... దాని ద్వారా ఆక్సిజన్ విడుదలని వేగవంతం చేస్తాయి. అలా సముద్రాన్ని ప్రాణవాయు పరిశ్రమగా మారుస్తాయి. సయానో బ్యాక్టీరియాలాంటి ఎన్నో సూక్ష్మజీవులపైన ఈ వైరస్‌లు దాడి చేయడం ద్వారానే సముద్రంలో కార్బన్ శాతం తగ్గి వాతావరణంలో చల్లదనం ఉండిపోతుంది. ఓ అంచనా ప్రకారం...
ఈ వైరస్‌లు ఏడాదికి 350 కోట్ల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ని కట్టడిచేస్తాయట. హైదరాబాద్ వంటి నగరంలో ఏడాదిపాటు ఏ వాహనమూ తిరక్కుండా ఆపగలిగితేగానీ మనుషులుగా మనం ఈస్థాయిలో కార్బన్‌ని కట్టడిచేయలేం!
గర్భం ఓ కంచుకోటలా!
వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించిన ప్రతిసారీ మనకి వ్యాధులు రావాలనేమీ లేదు. ఓ మూడున్నరలక్షల సంవత్సరాల ముందు- క్షీరదాలకు సోకిన రెట్రోవైరస్ వాటి శరీరకణాలలోకి తన డీఎన్‌ఏని చొప్పించిందట. ఆ వైరల్ డీఎన్‌ఏ మనకి చెడుచేయలేదు సరికదా... మన జన్యువుల్లో అంతర్భాగమైంది. ‘ఈఆర్‌వీడబ్ల్యూ1’ అనే ఆ ‘వైరస్ జన్యువు’ ఇప్పటికీ మనతోనే ఉంది. ఆ జన్యువే మన శరీరంలో ‘సిన్సిటిన్-1’, ‘సిన్సిటిన్-2’ అనే రెండు కీలక ప్రొటీన్‌ల వృద్ధికి దోహదపడుతుంది.
‘సిన్సిటిన్-1’ వల్లే స్త్రీల శరీరంలో- గర్భం ధరించినప్పుడు ‘మాయ’ అన్నది ఏర్పడుతోంది! పిండాన్నీ గర్భాశయాన్నీ కలిపి ఉంచడంలోనే కాదు... పిండానికి పోషకాలు అందించడంలోనూ ‘మాయ’ది కీలక పాత్ర. అది వరకు గుడ్లుపెట్టి పొదిగే జీవాలుగా మాత్రమే ఉంటూ వచ్చిన ప్రాణులు...
పెరిగేదాకా తమ పిండాన్ని కడుపులోనే దాచుకునేలా... తద్వారా శత్రుమూకల నుంచి కాపాడుకునేలా ఈ మాయే ఉపయోగపడింది. ‘సిన్సిటిన్-2’ ప్రొటీన్ విషయానికొస్తే... శరీరంలో ఏర్పడ్డ పిండాన్ని స్త్రీశరీరంలోని యాంటీబాడీలు నాశనం చేయకుండా ఇదే కాపాడుతుంది. అంతేకాదు, ఇతర వైరస్‌లూ, బ్యాక్టీరియా సోకకుండానూ కాచుకుంటుంది! ఆ రకంగా ఈ రెండు ప్రొటీన్‌లూ స్త్రీ గర్భాన్ని బిడ్డలపాలిట కంచుకోటగా మార్చాయి. వాటిని మనకి అందించిన ఘనత ఆ ఆదిమ వైరస్‌దే మరి!
'జ్ఞాపకం' వాటి చలవే!
జీవి ఏదైనా సరే... వాటికంటూ ఎంతోకొంత జ్ఞాపకం ఉంటుంది. వెన్నెముక జీవులకి ఈ జ్ఞాపకం మరీ అవసరం. మన మెదడులో జ్ఞాపకశక్తికి కారణమైన ప్రొటీన్‌ని ఆ మధ్య 3డీ ప్రింట్ తీశారు అమెరికాకి చెందిన జేసన్ షెఫర్డ్ అనే న్యూరాలజిస్టు. అది అచ్చం ఓ వైరస్ ఆకారంలోనే రూపుదిద్దుకుంది. ఆ ప్రొటీన్‌కి కారణమయ్యే మనలోని జన్యువేంటా అని పరిశోధించి దానికి ‘ఏఆర్‌సీ’ అని పేరు పెట్టారు. చిత్రమేంటంటే... ఆ ‘ఏఆర్‌సీ’ జన్యువు కూడా లక్షల సంవత్సరాలకిందట వైరస్ వల్లే మనలోకి వచ్చిందట. అదే మనుషులుగా మనం బుద్ధిజీవులం కావడానికి తొలి బీజం వేసిందంటారు జేసన్. ఇలా, వైరస్‌ల వల్ల మన శరీరంలో ఎన్నో మంచి జన్యుమార్పులు చోటుచేసు కున్నాయని చెప్పొచ్చు. మానవ శరీరంలో సుమారు పాతికవేలదాకా జన్యువులుంటాయి. వాటిలో ఎనిమిది శాతం వైరస్‌ల కారణంగా మనలోకి వచ్చినవేనట! వాటిలో ఇప్పటిదాకా ఈ మూడింటినే గుర్తించారు. మిగతా జన్యువులు మన శరీరంలో ఎలాంటి మంచి మార్పులకి దోహదపడ్డాయో తెలుసుకునేందుకు ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.
యాంటీబయోటిక్స్‌కి ప్రత్యామ్నాయం!
1896 ప్రాంతం... కలరా వ్యాధి విలయతాండవం చేస్తోంది. అప్పటికి కలరాకి ‘విబ్రియో కొలెరె’ అన్న బ్యాక్టీరియానే కారణమని గుర్తించారుకానీ... దాని వ్యాప్తిని ఎలా అరికట్టాలో తెలియట్లేదు. ఎర్నెస్ట్ హ్యాంకిన్ అనే బ్రిటిష్ ఇండియా శాస్త్రవేత్త అప్పుడో చిత్రమైన విషయం ప్రకటించాడు... గంగ-యమున నదుల్లోని నీటిని కలిపితే అందులో కలరా బ్యాక్టీరియా పెరగదని ప్రకటించి నిరూపించాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం.
భారతీయులు పవిత్ర నదులుగా కొలిచే గంగ-యమునలకి నిజంగానే అంత శక్తి ఉందా అనుకున్నారంతా! ఆ తర్వాత 20 ఏళ్లకి- 1917లో డి-హెలె అనే ఫ్రెంచి శాస్త్రవేత్త గంగ-యమున నదుల్లోని బ్యాక్టీరియాఫేగస్ అనే వైరస్‌లే అందుకు కారణమని తేల్చాడు. ఇవి బ్యాక్టీరియాని చెండుకు తినే వైరస్‌లన్నమాట!
యాంటీబయోటిక్స్ వచ్చాక ఫేగస్ ప్రభ కాస్త తగ్గినా 2010 తర్వాత యాంటీబయోటిక్‌ల విపరీతమైన వాడకంవల్ల మొండి బ్యాక్టీరియా పెరగడంతో మళ్లీ ప్రపంచం చూపు ఫేగస్‌వైపు తిరిగింది. ఇప్పుడు ఆ జగమొండి బ్యాక్టీరియాపైన ‘ఫేగస్ థెరపీ’ పేరుతో వైరస్‌లనే యుద్ధానికి దించుతున్నారు. అంతేకాదు, నేటితరం అత్యాధునిక జన్యు థెరపీలోనూ వాటిని ‘అలాఉదీన్ దీపం’లోని భూతంలా వాడుకుంటున్నాం.