రాష్ట్రంలో ఇళ్లస్థలాల పంపిణీ కోసం పేదల అసైన్డ్ భూములు బలవంతంగా సేకరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల భూములు లాక్కుని మళ్లీ మరొక పేదలకు పంచడమేంటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల పేరుతో చెట్లు కొట్టేయడమూ నేరమని స్పష్టం చేసింది. భూ సేకరణ ప్రాంతాలకు పోలీసుల్ని పంపడంపై డీజీపీని వివరణ కోరనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
మా సంస్థ మాకు ఉంది
ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూముల్ని అధికారులు బలవంతంగా తీసుకోవడాన్ని నిలువరించాలని, ప్రభుత్వ భూమిని స్వాధీనంలో ఉంచుకున్న పట్టాలు లేని పేదలను ఖాళీ చేయించకుండా తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో పాటు ఫొటోలు జతచేశారు. ఆ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించి బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ బలవంతపు భూ సేకరణ చేయడం లేదన్నారు. పోలీసుల ఫొటో భూసమీకరణ ఘటనకు సంబంధించినది కాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ....'ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటి వెనుక ఉద్దేశాలు మాకు తెలుసు. మాకు చాలా సంగతులు అందుతున్నాయి. మీ సంస్థను మీరు నడుపుతుంటే మా సంస్థ మాకుంది' అని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు కోసం ఏజీ గడువు కోరటంతో విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది.
అధికారులే బాధ్యులవుతారు